ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నాటునాటు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయ్యి చరిత్ర నెలకొల్పింది. ఈ ఒక్కపాటే కాకుండా ఇండియాకు చెందిన మరో రెండు సినిమాలు కూడా ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచాయి. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్, డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో ఆల్ ది బ్రీత్స్ సినిమాలు నామినేషన్స్ లో చేరాయి. దీంతో అందరి చూపు ఆ రెండు సినిమాలపై పడ్డాయి.
ఈ రెండు సినిమాలు గత ఏడాదే విడుదలై ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులను గెలుపొందాయి. ”ది ఎలిఫెంట్ విస్పరర్స్” అనే సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఒక గ్రామంలో వయసైపోయిన ఓ జంట ఒక అనాథ ఏనుగు పిల్లని పెంచుకుంటుంది. ఆ ఏనుగు పిల్లతో వారి అనుబంధం, అడవిలో జరిగే అల్లరి పనులు మధ్య కథ సాగుతుంది. ఇప్పటికే ఈ సినిమా అనేక అవార్డులు గెలుచుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ బరిలో ఉంది. ఈ సినిమాకు కార్తిక్ గోన్సాల్వేస్ దర్శకత్వం వహించారు.
డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ విభాగంలో మరో ఇండియా సినిమా ”ఆల్ ది బ్రీత్స్” నిలిచింది. ఈ సినిమా ఇంతవరకూ ఎక్కడా స్ట్రీమింగ్ కాలేదు. అమెరికాలో మాత్రం అవార్డుల కోసం థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. 2023లో ఈ సినిమాను హెచ్బీఓ ఛానెల్ టెలికాస్ట్ చేయనుంది. ఈ డాక్యుమెంటరీ ఢిల్లీలోని వజీరాబాద్ లో బర్డ్ క్లినిక్ ను నడిపే నదీమ్ షెజాద్, మహ్మద్ సౌద్ అనే ఇద్దరు సోదరుల మధ్య కథాంశం. 20 ఏళ్లుగా ఎన్నో పక్షులకు ఢిల్లీలో వైద్యం చేశారు. పక్షులు, మనుషుల మధ్య బంధాన్ని చూపించడమే ఈ సినిమా ప్రధాన అంశం. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా ఆస్కార్ రేసులో ఉంది.