శాకుంతలం విడుదలై నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. సినిమా విడుదలైన రోజు నుంచే నెగిటివ్ టాక్ రావడంతో, ఓటీటీకి కూడా త్వరగా వచ్చేస్తోంది. ఈ నెల మే 12వ తేదీన శాకుంతలం ఓటీటీల్లోకి అడుగుపెట్టనుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని అమేజాన్ ప్రైమ్ దక్కించుకుంది. సినిమా ఫలితం తెలియకముందే అమేజాన్ ఓటీటీ హక్కులను కొనుగోలు చేయడం గమనార్హం. సమంతకు తెలుగుతో పాటు, తమిళం, హిందీ భాషల్లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 20 కోట్లకు ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందట. సినిమా రిజల్ట్ తెలిసిన తర్వాత ఆ మాత్రం డబ్బులు కూడా నిర్మాతకు దక్కేవి కావు అనేది ఇన్ సైడ్ టాక్.
పౌరాణిక కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. దాదాపు అరవై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇరవై కోట్లలోపే వసూళ్లను రాబట్టలేదని తెలుస్తోంది. ఈ సినిమాతో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు తీవ్రంగా నష్టపోయారు. సినిమా ప్రమెషన్స్ సమయంలో తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి మరీ సమంత తన వంతు ప్రయత్నం చేసింది. కానీ ఫలితం దక్కలేదు. ఇక సినిమాలో ఏదైనా పాజిటివ్ పాయింట్ ఉంది అంటే.. అల్లు అర్హ. అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ నటనకు మాత్రం అందరూ ఫిదా అయిపోయారు.
భరతుడి పాత్రలో చాలా బాగా నటించింది. అయితే.. అర్హ కనిపించే నిడివి చాలా తక్కువ. కనీసం అర్హ పాత్ర కాస్త ఎక్కువగా ఉన్నా, తనకోసం చూసే వారి సంఖ్య అయినా పెరిగి ఉండేది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో శకుంతల పాత్రలో సమంత నటించగా దుష్యంతుడిగా దేవ్‌మోహన్ కనిపించాడు. మోహన్‌బాబు, అనన్య నాగళ్ల, సచిన్ ఖేడ్కర్, గౌతమ్, మధుబాల కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమాను గుణశేఖర్ తనయ నీలిమ గుణతో కలిసి దిల్‌రాజు నిర్మించాడు.