Bhadrachalam : భద్రాద్రి రాములోరి ఆభరణాల వార్షిక తనిఖీల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో వెండి ఇటుక మాయమైన విషయం వెలుగులోకి వచ్చింది. గురువారం తనిఖీలు నిర్వహించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆభరణాల పరిశీలన అధికారి ఆంజనేయులు బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం వెండి వస్తువులకు సంబంధించి రికార్డులు తనిఖీ చేయగా.. ఆరు కిలోల వెండి ఇటుక ఉన్నట్లు రికార్డుల్లో నమోదైనప్పటికీ అది మాత్రం కనిపించలేదు.
గతంలో వివిధ ప్రాంతాల నుంచి రామాలయానికి తరలివచ్చిన భక్తులు సమర్పించిన వెండి ఆభరణాలు విరిగిపోయినా.. పగిలిపోయినా వాటిని హైదరాబాద్ మింట్లో పనికిరాని 50 కిలోల వెండిని కరిగించి 11 వెండి ఇటుకలుగా తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఆలయ అవసరాలకు నాలుగు ఇటుకలు వాడారు. మరో ఏడు ఇటుకలు ఉండాలి. అయితే ప్రస్తుతం ఆరు ఇటుకలు మాత్రమే కనిపిస్తున్నాయని ఆలయ అధికారులు చెబుతున్నారు. దేవస్థానం వారు రమాదేవిని వివరణ కోరగా.. వెండి ఇటుక దొరకని పక్షంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, ఎట్టిపరిస్థితుల్లోనూ రికవరీ చేస్తామని, ఈ విషయంలో ఎవరినీ విడిచిపెట్టేది లేదని చెప్పారు.