»Bengaluru Gets First Driverless Metro Train Will Run On Yellow Line
Driverless Metro : మన దేశంలో డ్రైవర్ లెస్ మెట్రో రైలు ట్రయల్ రన్‌కు రెడీ!
మన దేశంలో కొత్త కొత్త రైళ్లు వరుసగా ప్రజలకు అందివస్తున్నాయి. రానున్న రోజుల్లో బులెట్ రైలు అందుబాటులోకి రానుంది. దానికంటే ముందే మన దగ్గర డ్రైవర్‌లెస్ మెట్రో రైళ్లు పట్టాలపై పరుగులు తీయనున్నాయి. తాజాగా ఇలాంటి మెట్రో రైలు ఒకటి ట్రైల్ రన్‌కు సిద్ధమైంది. ఎక్కడంటే..
Driverless Metro In Bangalore : ఇటీవల కాలంలో మన రైల్వే వ్యవస్థలు ఆధునికతను సంతరించుకుంటున్నాయి. కొత్త టెక్నాలజీలను అమలుపరచడంలో ముందంజ వేస్తున్నాయి. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు డ్రైవర్ లెస్ మెట్రో రైళ్లను కూడా తొందరలో మనం చూడబోతున్నాం. ఇలాంటి డ్రైవర్ లెస్ మెట్రో(Driverless Metro) రైలు ఒకటి కర్ణాటకలోని బెంగళూరులో టెస్ట్ రన్‌కు సిద్ధమైంది.
ఈ డ్రైవర్ లెస్ మెట్రో రైలు ట్రయల్ రన్‌ను చేపట్టేందుకు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(BMRCL) అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నమూనా రైలు ఇప్పటికే చైనా నుంచి గతవారం బెంగళూరుకు చేరుకుంది. దీనికి వివిధ రకాల టెస్టులు నిర్వహించి రైల్వే శాఖ నుంచి అనుమతి తీసుకోనున్నామని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు చెబుతున్నారు.
ఈ ట్రయల్ రన్ విజయవంతం అయితే బెంగళూరు మెట్రో రైలు చరిత్రలో సరి కొత్త అధ్యాయానికి తెరలేవనుంది. తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు మరి కొన్ని నెలల్లో అక్కడి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం… దీనిలో ఆరు కోచ్‌లు ఉంటాయి. ఈ కోచ్‌లను బెంగళూరులోని ఐటీ హబ్, ఎలక్ట్రానిక్ సిటీలోని హెబ్బగోడి డిపోకు తరలించారు. ఎల్లో లైన్లో ఆర్వీ రోడ్డు నుంచి సిల్క్ బోర్డు మీదుగా ఎలక్ట్రానిక్ సిటీ వరకు ఈ రైలును నడపనున్నారు. ఈ డ్రైవర్ లెస్ మెట్రో రైలు కోచ్‌లను చైనాకు చెందిన సంస్థ సమకూర్చింది. 216 కోచ్‌ల తయారీకి ఆ సంస్థతో బీఎంఆర్సీఎల్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.