Japan GDP : జపాన్ను వెనక్కి నెట్టి మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన జర్మనీ
ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్ ఇప్పుడు మరో స్థానాన్ని కోల్పోయింది. జర్మనీ దాని స్థానాన్ని కొల్లగొట్టింది. దీంతో జపాన్ ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది. వివరాల్లోకి వెళితే...
Japan Economy : అమెరికా, చైనాల తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానంలో ఉండేది జపాన్(Japan). తాజా గణాంకాల ప్రకారం ఇప్పుడు అది మరో స్థానాన్ని కోల్పోయి నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ ఏడాది జపాన్ జీడీపీ 4.2 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. దీన్ని వెనక్కు నెట్టి జర్మనీ(germany) మూడో స్థానానికి ఎగబాకింది. దీని జీడీపీ 4.4 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది.
జపాన్లో ప్రస్తుతం పిల్లలు, యువత సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ ప్రభావం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మీద క్రమంగా పడుతూ వస్తోంది. క్రమంగా ఆ దేశం ఉత్పాదకతను కోల్పోతోంది. దీంతో అక్టోబర్, డిసెంబర్ క్వార్టర్లో జపాన్ జీడీపీ 0.4 శాతం క్షీణించింది. నిజానికి జపాన్ 2010 వరకు ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో రెండో స్థానంలో ఉండేది. 2010లో చైనా దాన్ని వెనక్కు నెట్టింది. ఇప్పుడు మళ్లీ జర్మనీ(germany) దీన్ని నాలుగో స్థానానికి నెట్టి ముందుకు వెళ్లింది.
ప్రస్తుతం అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానంలో ఉన్న భారత్ రానున్న రోజుల్లో జపాన్ని వెనక్కి నెట్టి ముందుకు వెళుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. జపాన్, జర్మనీలు రెండూ ఉత్పత్తులను ఉత్పాదన చేయడంతోనే తమ ఆర్థిక వ్యవస్థల్ని బలంగా నిలుపుకొన్నాయి. చిన్న, మధ్య తరహా వ్యాపారాలను ప్రోత్సహించి చిన్న దేశాలే అయినా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా అవతరించాయి. ఇదే సూత్రాన్ని వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్ కూడా అవలంబించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.