Putin says a Biden presidency is better : అమెరికాకు రెండో సారి కూడా బైడన్(Biden ) అధ్యక్షుడిగా ఉండాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. డొనాల్డ్ ట్రంప్(Donald Trump )తో పోలిస్తే బైడెన్ అధ్యక్షుడిగా ఉండటం బాగుంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు. అయితే ఎవరు గెలిచినా కలిసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉంటామని ఆయన వ్యాఖ్యానించారు.
రష్యాని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే బైడెన్ రావాలనే తాము కోరుకుంటామని పుతిన్ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల కాలంలో అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై వస్తున్న అనేక విమర్శలు, ఊహాగానాలపై తాను వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయ పడ్డారు. అందుకు తానేమీ వైద్యుడిని కాదన్నారు. రానున్న రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే బైడెన్‌పై ఇలాంటి విమర్శలు వస్తున్నాయని చెప్పారు.
ట్రంప్ విధానాలతో పోలిస్తే బైడెన్ వైఖరులు చాలా బలంగా ఉంటాయని పుతిన్ అభిప్రాయ పడ్డారు. అలాగే కొన్ని లోపాలూ ఉన్నాయన్నారు. ఈ విషయాలపై తాను స్వయంగా ఆయనతోనూ మాట్లాడానని అన్నారు. అమెరికా విదేశాంగ విధానానికి నాటో ఒక ఆయుధం అంటూ చెప్పుకొచ్చారు. నాటో దేశాలు తమ రక్షణ బడ్జెట్‌ను పెంచకపోతే తానే రష్యాను ఉసిగొల్పుతానంటూ ట్రంప్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన కోణంలో ఆయన సరిగ్గానే మాట్లాడి ఉండొచ్చని పుతిన్(Putin) చెప్పుకొచ్చారు. మిత్ర దేశాలతో సంబంధాల్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఆయన అలా మాట్లాడి ఉండొచ్చన్నారు.