Pakistan Election Results : పాక్ ఎన్నికల్లో ఆధిక్యంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ
పాకిస్థాన్ ఎన్నికల్లో అనూహ్యంగా ఇమ్రాన్ ఖాన్కు చెందిన తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ విజయాలను దక్కించుకుంటూ ఉంది. దీంతో ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పాకిస్థాన్లో జాతీయ అసెంబ్లీ, నాలుగు ప్రావిన్సుల్లో శాసన సభలో కోసం ఎన్నికలు జరిగాయి. ఆ ఫలితాల్లో అనూహ్యంగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అభ్యర్థులు దూసుకుపోతున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కౌంటింగ్ శుక్రవారం సాయంత్రానికి పూర్తవుతుంది. దీంతో పూర్తి ఫలితాలు సాయంత్రానికి తెలిసే అవకాశాలు ఉన్నాయి.
ఈ ఎలక్షన్లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాబ్ (PMLN) సునాయసంగా విజయం సాధిస్తుందని అంతా అభిప్రాయ పడ్డారు. అయితే అంచనాలకు భిన్నంగా ఇప్పుడు కౌంటింగ్లో భిన్నంగా ఫలితాలు వచ్చినట్టు తెలుస్తోంది. వివిధ కేసుల్లో శిక్ష పడి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(PTI)అభ్యర్థులు దూసుకుపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
సుమారు 154 స్థానాల్లో పీటీఐ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులలో అత్యధిక స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థులు విజయం సాధించారని సమాచారం. ఇప్పటికే వీరు 47 సీట్లను గెలుచుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ విజయాలపై జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ట్వీట్ చేశారు. అనుకోకుండా అనూహ్య ఫలితాలు వస్తుండటం వల్ల PMLN అధినేత నవాజ్ షరీఫ్ పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది.