»Then The State Now Congress Is Dividing My Family Cm Jagan
AP: అప్పుడు రాష్ట్రాన్ని..ఇప్పుడు నా కుటుంబాన్ని కాంగ్రెస్ విడదీస్తోంది : సీఎం జగన్
ఏపీని విభజించినట్లే తమ కుటుంబాన్ని కూడా విభజించేందుకు కాంగ్రెస్ చూస్తోందని, ఆ పార్టీ ఎప్పుడూ థర్డ్ గేమ్ ఆడుతుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. మరోసారి తమను ప్రజలే గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విడదీస్తే ఇప్పుడు తన కుటుంబాన్ని కాంగ్రెస్ విడదీసిందని, కాంగ్రెస్ చెత్త రాజకీయాలు చేస్తోందని ఏపీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. తిరుపతిలో నిర్వహించిన ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఈసారి కూడా తప్పనిసరిగా తామే అధికారంలోకి వస్తామన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకొచ్చామన్నారు.
వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్నవారికీ అన్ని పథకాలను అందించినట్లు సీఎం జగన్ గుర్తు చేశారు. మేనిఫెస్టోలో 99.5 శాతం హామాలను నెరవేర్చామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ డర్టీ గేమ్ ఆడుతోందని, విభజించి రాష్ట్రాన్ని పాలించాలని అనుకుంటున్నారని విమర్శలు గుర్పించారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినట్లే తమ కుటుంబాన్ని కూడా విభజించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాక అప్పట్లో తన చిన్నాన్నను తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పనిచేయించిందని, ఇప్పుడు కూడా అదే చేస్తోందని అన్నారు. వారికి ఆ దేవుడే గుణపాఠం చెబుతాడన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆయన ఓ విషయాన్ని విన్నవించారు. తమ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయాలని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. ప్రతి కుటుంబానికి తమ పథకాలు అందాయన్నారు. ప్రజలే తమకు మరోసారి పట్టం కడతారని తెలిపారు.