KTR: అలా మాట్లాడడం తప్పు.. బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ హితబోధ
బీఆర్ఎస్ పార్టీని ఓడించి ప్రజలు తప్పు చేశారనడం సరికాదని కేటీఆర్ అన్నారు. ఈ రోజు జరిగిన భువనగిరి లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు.
KTR: ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ ఘోరమైన ఓటమిని చవిచూసింది. ఇంకా పార్టీ శ్రేణులు తమ పరాజయాన్ని జీర్ణించుకోవడం లేదు. దాంతో కొందరు నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిగా హామీలు ఇచ్చిందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మరికొందరు ఇది ప్రజల వైఫల్యం అని, కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజలు తప్పు చేశారని కూడా అంటున్నారు. తాజాగా వీటిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రజలు తప్పు చేశారనడం సరికాదని హితబోధ చేశారు. రెండు సార్లు మనకు అవకాశం ఇచ్చింది కూడా ఆ ప్రజలే అని గుర్తు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన భవన్లో భువనగిరి లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ ఈ మాటలు అన్నారు.
ఇకపై బీఆర్ఎస్ నాయకులు ఎవరూ అలా మాట్లాడవద్దని సూచించారు. ప్రజా నిర్ణయాన్ని ఎప్పుడూ గౌరవించాలని గుర్తు చేశారు. ఇది ప్రజాసామ్యం వారు ఎవరిని కోరుకుంటే వారే అధికారంలోకి వస్తారని వెల్లడించారు. ప్రజలు మన పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని, కాంగ్రెస్ పార్టీకి, మనకు ఓట్ల తేడా కేవలం 1.8 శాతం మాత్రమే అని తెలిపారు. 14 చోట్ల అతి స్వల్ప తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడిపోయారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే అని, కాంగ్రెస్ ఇచ్చే అన్ని పథకాలు ప్రజలకు అందేల చూడాల్సిన బాధ్యత మనమీదే ఉందని అన్నారు.