సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా గణతంత్ర దినోత్సవం నాడు సొంత పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిని చెప్పుతో కొడతానని సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశామని.. ఇప్పుడు తమ కూతురును చదివించుకోలేమని పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేసింది. జగన్ అధికారంలోకి రావడంతో ఎలాంటి ప్రయోజనం లేదని వాపోయింది. ఆమె ఆవేదనకు గల కారణాలు ఇవే..
సత్తెనపల్లి మండలం పెద్దమక్కెన ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి. ఈమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. గణతంత్ర దినోత్సవం రోజు పాఠశాలలో జరిగిన వేడుకల్లో ప్రధానోపాధ్యాయురాలు వనజతో విజయలక్ష్మి వాగ్వాదానికి దిగింది. తనకు గ్రామంలో గౌరవం లేదని.. తమకు విలువ లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి మంత్రి అంబటి రాంబాబు కారణమని తెలిపింది. మంత్రి అంబటిని చెప్పుతో కొడతానని తీవ్ర ఆగ్రహంతో చెప్పింది. తాజాగా దీనిపై విజయలక్ష్మి వివరణ ఇచ్చింది. తనకు అంత కోపం ఎందుకొచ్చిందో తెలిపింది.
‘పార్టీ కోసం మేం చాలా కష్టపడ్డాం. ఎంపీటీసీగా గెలిచేందుకు దాదాపు రూ.30 లక్షలు ఖర్చు చేశాం. ఇప్పుడు మా కూతు చదువుకు కూడా డబ్బులు లేని పరిస్థితి. పార్టీ కోసం అంతలా కష్టపడితే ఇప్పుడు పురుషోత్తం, భాస్కర్ రెడ్డి అనే వ్యక్తులు వచ్చి మంత్రి అంబటిని తప్పుదోవ పట్టిస్తున్నారు. గ్రామంలో ఏ పనులకు మాకు సమాచారం ఇవ్వడం లేదు. పార్టీ కోసం పని చేసిన వారికి ఏమీ చేయడం లేదు. మొత్తం వారిద్దరే చూసుకుంటున్నారు. ఇప్పుడు మేం అప్పులపాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎంపీటీసీ పదవి ఇచ్చారే కానీ అధికారం లేకుండా చేస్తున్నారు. మెడలో బంగారు తాడు కూడా లేకుండా తిరుగుతున్న పరిస్థితి. ఆ కోపంలోనే మంత్రి అంబటిని చెప్పుతో కొడతానని చెప్పా’ అని ఎంపీటీసీ సభ్యురాలు విజయలక్ష్మి స్థానిక మీడియాతో మాట్లాడింది.