ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. తమ సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీలు గత 19 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కార్యకర్తలు నిరసన తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో నేడు అంగన్వాడీలు మంత్రుల ఇళ్లను ముట్టడించారు. ఈ క్రమంలో ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
నాలుగు నియోజకవర్గాల అంగన్వాడీలు నేడు మంత్రి విడదల రజిని ఇంటిని ముట్టడించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు కనీస వేతనాలను పెంచాలని, గ్రాట్యూటీని అమలు చేయాలని, అప్పటి వరకూ సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. ఆ సందర్భంగా అంగన్వాడీల డిమాండ్లను తీరుస్తామని మంత్రి విడదల రజనీ హామీ ఇచ్చారు.
ఇది కూడా చూడండి: Revanth Reddy: డెలివరీ బాయ్ కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థికసాయం
అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి వద్ద కూడా అంగన్వాడీలు నిరసన తెలిపారు. మరోవైపు స్త్రీ ,శిశు ,సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంటిని ముట్టడించేందుకు అంగన్వాడీలు ప్రయత్నించారు. విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ముట్టడికి అంగన్వాడీలు ప్రయత్నించగా అన్నిచోట్లా పోలీసులు అంగన్వాడీల సమ్మెకు అడ్డుపడ్డారు. కొన్ని చోట్ల అంగన్వాడీలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.