Pakistan: ఈ ఏడాది కొత్త సంవత్సర వేడుకలపై పాకిస్థాన్ ప్రభుత్వం కఠిన నిషేధం విధించింది. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడుల నేపథ్యంలో పాలస్తీనా ప్రజలకు పాకిస్థాన్ మరోసారి మద్దతు ప్రకటించింది. ఈక్రమంలోనే గాజా ప్రజలకు మద్దతుగా నూతన సంవత్సర వేడుకలు చేసుకోకూడదని నిర్ణయించుకుంది. న్యూ ఇయర్ వేడుకలపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నట్లు పాక్ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్ కాకర్ ప్రకటించారు. నిన్న రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని కాకర్ ఈ విషయాన్ని తెలిపారు. పాలస్తీనాలో తీవ్రమైన యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.
ఇలాంటి విపత్కర సమయంలో పాలస్తీనా సోదరుడు, సోదరీమణులకు సంఘీభావంగా ఎలాంటి వేడుకలు జరపకుండా నిషేధం విధిస్తున్నామని తెలిపారు. గత కొంతకాలం నుంచి పాక్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా నూతన సంవత్సర వేడుకలను అక్కడ అంత ఆర్భాటంగా చేయరు. ఒకవేళ చేసినా.. కొన్ని గ్రూప్లు బలవంతంగా వాటిని అడ్డుకుంటాయి. తాజాగా ప్రధాని ప్రకటన పెద్దగా ప్రభావం చూపించపోవచ్చు. గాజాలో ఇప్పటివరకు 21 వేలమంది పాలస్తీనియన్లు మృతి చెందారన్న పాక్ ప్రధాని.. ఇజ్రాయెల్ దాడుల్లో 9 వేల మంది చిన్నారులే మరణించారని గుర్తు చేశారు.