భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ రాంచీ వేదికగా రాత్రి 7గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కీవిస్ పై జరిగిన మూడు వన్డేల్లో గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి ఇండియా అదే ఊపుతో టీ20 సిరీస్‌లోను అద్భుత ప్రదర్శన కనబర్చేందుకు సిద్ధమైంది. అయితే, టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, షమీ వంటి సీనియన్ ఆటగాళ్లు లేకుండా హార్ధిక్ పాండ్యా సారథ్యంలో టీమిండియా జట్టు బరిలోకి దిగుతుంది.
వన్డేల్లో రోహిత్, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ జోడి అద్భుతంగా రాణించారు. టీ20 జట్టులో రోహిత్ లేకపోవటంతో గిల్‌తో ఎవరు జతకడతారనే విషయం ఆసక్తికరంగా మారింది. జట్టులోకి పునరాగమనం చేసిన పృథ్విషా ఓపెనర్ గా బరిలోకి దిగుతారని అందరూ భావించినప్పటికీ కెప్టెన్ హార్ధిక్ మాత్రం గిల్, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారని క్లారిటీ ఇచ్చారు. వీరితో పాటు రాహుల్ త్రిపాటి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా బ్యాటింగ్ లైనప్ తో టీమిండియా బలంగా ఉంది. అయితే బౌలింగ్ విభాగంలో షమీ, సిరాజుద్దీన్ ఇద్దరికి విశ్రాంతి లభించడంతో ప్రధాన బౌలర్ గా కెప్టెన్ హార్ధిక్ బాధ్యతలు తీసుకొనే అవకాశం ఉంది.