man revamps his jaguar car with g20 colours in gujarat
ఈసంవత్సరం జరగబోయే జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ సదస్సు సెప్టెంబర్ లో జరగనుంది. గత సంవత్సరం ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. ఈసంవత్సరం మాత్రం భారత్ లో జీ20 సదస్సును నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఈ సదస్సు జరగనుంది. ఈనేపథ్యంలో గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఓ యువకుడు తన జాగ్వార్ కారుకు జీ20 కలర్స్ వేశాడు.
అంతటితో ఆగకుండా సూరత్ నుంచి జాతీయ రాజధాని ఢిల్లీకి చేరుకొని జీ20 సదస్సుపై అవగాహన కల్పిస్తున్నాడు. అతడి పేరు సిద్ధార్థ్ దోషి. జీ20 సమ్మిట్ ను భారత్ తొలిసారి హోస్ట్ చేయడం భారతీయులంతా గర్వించదగ్గ పరిణామం అని ఈసందర్భంగా దోషి చెప్పుకొచ్చారు.
నేను ప్రధాని నరేంద్ర మోదీకి పెద్ద ఫ్యాన్ ను. అందుకే నా కారుకు ఇలా జీ20 థీమ్ కలర్స్ వేయించా. సూరత్ నుంచి కారును డ్రైవ్ చేసుకుంటూ ఢిల్లీకి చేరుకున్నా. జీ20 సదస్సు ప్రాముఖ్యతను అందరికీ తెలిపేందుకే నేను ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాను. నా కారు చూసి అయినా అందరికీ జీ20 సదస్సు ప్రాధాన్యత తెలుస్తుందని భావిస్తున్నా.. అన్నాడు సిద్ధార్థ్.
ఇది వరకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా అమృత్ మహోత్సవ్ ఆఫ్ ఇండిపెండెన్స్ థీమ్ తో తన కారును డెకరేట్ చేశాడు. తాజాగా జీ20 సమ్మిట్ థీమ్ తో కారును డెకరేట్ చేశాడు దోషి.