»Henceforth Free Medical Treatment Up To Rs 25 Lakhs Under Arogyashri Distribution Of New Cards
CM Jagan: ఇకపై ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం..కొత్త కార్డులు పంపిణీ
ఆరోగ్య కింద రూ.25 లక్షల వైద్యం అందించనున్నట్లు ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. వైద్యం కోసం ప్రతి ఒక్కరూ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఇకపై రాకూడదని అన్నారు. కొత్తగా ఆరోగ్య శ్రీ కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు.
నిరుపేదల కోసం సీఎం జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యం అందించనున్నట్లు ప్రకటించింది. సీఎం జగన్ నేటి నుంచి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొత్త ఫీచర్లతో కూడిన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను నేటి నుంచి ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పలు విషయాల గురించి ప్రస్తావించారు.
నేటి నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏ పేదవాడూ వైద్యం కోసం అప్పులపాలు కాకూడదని అన్నారు. ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఒక వరం అని అన్నారు. రాష్ట్రంలో 4.25 కోట్ల మందికి ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేసినట్లు తెలియజేశారు. ఆరోగ్యశ్రీలో చికిత్సల సంఖ్యను కూడా పెంచినట్లుగా సీఎం జగన్ వెల్లడించారు.
1059 ప్రొసీజర్ల నుంచి 3,257 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చినట్లుగా సీఎం జగన్ వివరించారు. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్య పరిధిలోకి వస్తుందన్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆరోగ్యశ్రీలో భాగంగా ఆపరేషన్ అయిన తర్వాత ఇంటికే మందులు డోర్ డెలివరీ అయ్యేట్లు చేశామని, ఇకపై వైద్యం విషయంలో ఎవ్వరూ బాధపడాల్సిన పనిలేదని సీఎం జగన్ భరోసా ఇచ్చారు.