Gadwal: ఓ వ్యక్తి ప్యాంటు జేబులో సడెన్గా సెల్ఫోన్ పేలిన ఘటన గద్వాల్లో చోటు చేసుకుంది. గద్వాల పరిధిలోని బీసీ కాలనీకి చెందిన జయరాముడు నిన్న సాయంత్రం కూరగాయలు కొనడానికి మార్కెట్కు వెళ్లాడు. అక్కడ అతను వ్యాపారులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా ప్యాంటులో జేబులో ఉన్న సెల్ఫోన్ పేలింది. స్థానికులు వెంటనే భయపడి పరుగులు తీశారు. జయరాముడు కూడా వెంటనే అప్రమత్తం కావడంతో ఎలాంటి గాయం కాలేదు. కానీ ప్యాంటు జేబు కాలిపోయి.. సెల్ఫోన్ భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
ఫోన్లోని లిథియం అయాన్ బ్యాటరీల వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. కాబట్టి మొబైల్స్ ఉపయోగించేటప్పుడు జాగ్రత్త తప్పనిసరి. బ్యాటరీలు ఉబ్బినట్లు కనిపిస్తే వెంటనే వాటిని తొలగించి కొత్త బ్యాటరీ వేయాలి. అలాగే ఆ కంపెనీకి చెందిన ఒరిజినల్ ఛార్జర్లు, బ్యాటరీలు మాత్రమే వినియోగించాలి. ఛార్జింగ్ పెడుతూ.. కాల్స్ మాట్లాడటం, గేమ్స్ ఆడటం వంటివి చేయకూడదు. నిద్రించే సమయంలో ఫోన్ పక్కన పెట్టుకుని పడుకోకూడదు. మొబైల్ వేడిక్కితే వెంటనే ఛార్జింగ్ ఆపేయడం వంటివి చేస్తే ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడవచ్చు.