Rain Alert: ఏపీకి రెయిన్ అలర్ట్..భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రవ్యాప్తంగా భీకర వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ (IMD) అమరావతి కేంద్రం తెలిపింది. ఈ మేరకు ప్రజలను అలర్ట్ చేసింది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం నేడు భారీగా విస్తరించిందని వెల్లడించింది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ (Weather Department) తెలిపింది.
ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా వంగి ఉండటం వల్ల దాని ప్రభావంతో మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం (Weather Department) వెల్లడించింది. అల్పపీడనం మధ్య బంగాళాఖాతం దిశగా పయనిస్తోందని, నవంబర్ 16వ తేదికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి (Amaravati) వాతావరణ కేంద్రం తెలిపింది.
వాయుగుండంగా మారితే అత్యంత భారీ వర్షాలు నమోదవుతాయని, ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ 14, 15వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.