»Negligence Of Voter List Officials Cm Jagans Photo In Womans Place
Voter List: ఓటరు జాబితా అధికారుల నిర్లక్ష్యం..మహిళ స్థానంలో సీఎం జగన్ ఫోటో!
ఏపీలోని ఓటరు జాబితాలో మహిళ స్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో ప్రత్యక్షమైంది. ఇప్పటికే ప్రతిపక్షాలు ఓటరు జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ తరుణంలో సీఎం జగన్ ఫోటో మహిళ స్థానంలో ఉండటంతో మరోసారి విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) రానున్న నేపథ్యంలో అధికారులు ఓటరు జాబితాను సిద్ధం చేశారు. అయితే ఈ జాబితా విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు పలు ఆరోపణలు చేస్తున్నాయి. ఆ ఆరోపణలను నిజం చేస్తూ తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. ప్రకాశం జిల్లా (Prakasham District)లోని చెర్లోపల్లి గ్రామం ఓటరు జాబితాలో మహిళ స్థానంలో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో (CM Photo) ప్రత్యక్షమైంది. మహిళ ఫోటో ఉండాల్సిన చోట సీఎం జగన్ ఫోటో ఉండటంతో పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఓటరు జాబితాలో (Voter List) సవరణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని చెర్లోపల్లిలో గ్రామ ఓటరు జాబితాలో సీఎం జగన్ ఫోటో (CM Jagan Photo) కనిపించింది. ఫోటో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలింగ్ సిబ్బంది మాత్రం పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని ఫైర్ అవుతున్నారు.
చెర్లోపల్లి గ్రామానికి చెందిన గురవమ్మ అనే మహిళ ఫోటోకు బదులుగా సీఎం జగన్ ఫోటోను అప్లోడ్ చేయడం వల్లే ఇలా జరిగినట్లు తెలుస్తోంది. బీఎల్ఓలో కంప్యూటర్ ఆపరేటర్ (Computer Operator) నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఓటరు జాబితాను సిద్ధం చేసిన తర్వాత ప్రింటింగ్‌కు ఇచ్చే ముందు కూడా బీఎల్ఓతో పాటుగా రెవెన్యూ అధికారులు కూడా చెక్ చేయాల్సి ఉంటుంది.
కానీ ఎవ్వరూ కూడా మహిళ స్థానంలో సీఎం జగన్ ఫోటోను గమనించకుండా ఉండటంతో పలువురు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ అని విమర్శిస్తున్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు ఈ ఘటనతో ఒక్కసారిగా ఫైర్ అవుతున్నాయి. మరోసారి అక్రమాలు బయటపడ్డాయంటూ సోషల్ మీడియా (Social Media) వేదికగా వాపోతున్నాయి.