»Cow Swayamvaram Celebrations Swayamvaram For The Cow
Cow swayamvaram celebrations : ఆవుకు స్వయంవరం.. శుభలేఖ వేసి ప్రచారం!
ఓ డాక్టర్ తాను పెంచుకుంటున్న ఆవుకు స్వయంవరాన్ని ప్రకటించాడు. రేపు ఉదయం 9 గంటలకు ఆ ఆవును స్వయంవరం జరగనుంది. అలాగే వివాహ మహోత్సవం, విందు ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి.
చాలా మంది తమ పెంపుడు జంతువులను సొంతింటి సభ్యుల్లా చూస్తారు. వాటికి ఏదైనా అయితే విలవిల్లాడిపోతారు. అలాగే వాటికి సంబంధించిన ఏదైనా స్పెషల్ కార్యక్రమాలు చేయడానికి ఎంతో మక్కువ చూపుతుంటారు. ఈ మధ్యకాలంలో ఆ తంతు మరికాస్త ఎక్కువైంది. ఇటీవలె ఓ కుక్కకు శ్రీమంతం చేసిన ఘటన వైరల్ అయ్యింది. అలాగే పిల్లికి కూడా పుట్టిన రోజును మరొక కుటుంబం వేడుకగా చేసింది. ఇలా పెంపుడు జంతువులకు సంబంధించిన కొన్ని సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో ఈమధ్య వైరల్ (Viral) అవుతూ వస్తున్నాయి.
వైరల్ అవుతోన్న గోమాత స్వయంవరం లేఖ:
తాజాగా ఓ డాక్టర్ తన పెంపెడు ఆవుకు వివాహం (Cow Marriage) చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం రాజుల కాలంలో లాగా స్వయంవరాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా శుభలేక వేసి మరి అందులో ఆవు ఫోటోతో ప్రచారం చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ (Kakinada) వద్ద చోటుచేసుకుంది. రమణయ్య పేటలో గౌరీశేఖర్ అనే వ్యక్తి ఓ ఆవును పెంచుకుంటూ ఉన్నాడు. ఆ ఆవును తన సొంత బిడ్డలాగా చూసుకున్నాడు. తనకు ఇద్దరు కూతుర్లు ఉన్నా గౌరీ శేఖర్ మాత్రం తన కన్నబిడ్డలాగే ఆ ఆవును చూసుకున్నాడు. ఆ ఆవుకు చిన్నప్పుడు బారసాల చేశాడు. ఊయల వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించాడు. అప్పట్లోనే ఆ ఆవుదూడకు బారసాల చేయడం నెట్టింట ఎంతో వైరల్ అయ్యింది.
తాజాగా ఆ ఆవు యుక్త వయస్సుకు రావడంతో స్వయంవరాన్ని (Cow swayamvaram) ప్రకటించాడు. ఆ ఆవుకు 21 ఏళ్లు రావడంతో దానికి వివాహం చేసేందుకు ఆ డాక్టర్ సిద్ధమయ్యాడు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఆ ఆవుకు స్వయంవరాన్ని ప్రకటించాడు. రేపు ఉదయం 9 గంటలకు ఆ ఆవును చూసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి నందీశ్వరులు అక్కడికి రానున్నారు. అలాగే వివాహం కూడా ఎంతో ఘనంగా చేసేందుకు ఆ డాక్టర్ ప్లాన్ చేశాడు. ఓ ఫంక్షన్ హాలును కూడా బుక్ చేసి అందులో విందును కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఈ వివాహ మహోత్సవానికి కంచి, తిరుపతి, తిరువణ్ణామలై నుంచి వేద పండితులు రానున్నారు. అలాగే శాస్త్రోక్తంగా, వైభవంగా వివాహాన్ని జరిపించనున్నట్లు శుభలేఖలో గౌరీ శేకర్ పేర్కొన్నాడు. అంతేకాకుండా గోఆధారిత వ్యవసాయం ద్వారా పండిన పంటలతో విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపాడు. ఈ వివాహ మహోత్సవానికి తిరుమల హాస్పిటల్ కాకినాడ వేదిక కానుంది.