»Indian Council Of Medical Research Has Successfully Conducted Clinical Trials Of Male Contraceptive Injection For The First Time In The World
Contraceptive injection: పురుషులకు ప్రపంచంలోనే తొలి సంతాన నిరోధక ఇంజెక్షన్
ప్రపంచంలో తొలిసారిగా పురుషులకు సంతాన నిరోధక ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్‌లో భారత వైద్య పరిశోధక మండలి విజయవంతం చేసింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తుందని భారత వైద్య మండలి నిర్ధారించింది.
Contraceptive injection: మహిళలు గర్భం దాల్చకుండా ఉండేందుకు పురుషులు వ్యాసెక్టమీ చేయించుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే పురుషులకు ఇంజెక్షన్ చేస్తే స్త్రీలు గర్భం దాల్చకుండా ఉండేలా భారత వైద్య పరిశోధక మండలి ఇంజెక్షన్‌ను తయారు చేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా పురుషుల కోసం తయారు చేసిన సంతాన నిరోధక ఇంజెక్షన్‌పై క్లినికల్ ట్రయల్స్‌ను భారత వైద్య పరిశోధక మండలి విజయవంతంగా పూర్తిచేసింది. ‘రివర్సిబుల్ ఇన్ హైబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్’ అనే ఇంజెక్షన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సురక్షితంగా పనిచేస్తుందని, సంతానోత్పత్తిని 99శాతం ఇది అడ్డుకుంటున్నట్లు నిర్ధారించారు.
సంతాన నిరోధక చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన 303మందిపై ఢిల్లీ, ఉధంపూర్, లూధియానా, జైపూర్, ఖరగ్‌పూర్‌లలో నిర్వహించిన మూడో విడత క్లినికల్ ట్రయల్స్‌లో ఈ విషయాన్ని నిర్ధారించారు. 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న వారిపై ఈ ట్రయల్స్ నిర్వహించారు. ఒక్కో పురుషుడికి 60ఎంజీ మోతాదులో ‘రివర్సిబుల్ ఇన్ హైబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్’ అనే ఇంజెక్షన్‌ను ఇచ్చారు. వీర్యకణాలను నియంత్రించడంలో ఈ ఇంజెక్షన్ 97.3 శాతం సమర్థవంతంగా పనిచేసిందని వెల్లడించారు.
ఈ ఇంజెక్షన్‌ను శరీర భాగాలకి ఇంజెక్ట్ చేస్తారు. ఒకసారి ఈ ఇంజెక్షన్ తీసుకుంటే దాదాపు 13 సంవత్సరాల పాటు సంతాన నిరోధకంగా పనిచేస్తుంది. ప్రస్తుతం పురుషులు, స్త్రీలు వినియోగిస్తున్న గర్భనిరోధక పద్ధతుల కంటే ఈ విధానం చాలా సురక్షితమైనదని నిర్ధారించింది. సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని మళ్లీ తిరిగి పొందేందుకు ఈ విధానంలో వీలుంటుందని వెల్లడించింది.