Fire hazard: బాపట్ల జిల్లాలోని ఓ వస్త్ర పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘోర అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఇంకొల్లులోని వస్త్ర తయారీ ఫ్యాక్టరీ NSL టెక్స్ టైల్స్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఫ్యాక్టరీలోని వస్త్రాలతో పాటు మిషనరీలు కాలిబూడిదయ్యాయి. పరిశ్రమలోని ఓ విభాగంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఈ భారీ ప్రమాదం జరిగి ఉంటుందని కార్మికులు అంటున్నారు. ప్రమాదం జరిగే సమయానికి కార్మికులు ఉన్నారు. వాళ్లు వెంటనే అప్రమత్తమై మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాలేదు.
అగ్నిమాపక సిబ్బందికి తెలుపగా.. వాళ్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆపే ప్రయత్నం చేశారు. కానీ మంటలను ఆపడానికి చాలా సమయం పట్టింది. అప్పటికే భారీ నష్టం వాటిల్లింది. మొత్తం 20యంత్రాలు ఈ ప్రమాదంలో తగలబడిపోయాయి. సుమారు మూడు వేల టన్నుల దారం బూడిదలో కలిసిపోయింది. అంటే సుమారుగా రూ.400 కోట్లు నష్టం వాటిల్లిందని హెచ్ఆర్ అధికారి రత్నం తెలిపారు. ఈ ప్రమాదం జరిగే సమయంలో 200 మందికి పైగా కార్మికులు అక్కడే ఉన్నారు. కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగిందని తెలిపారు.