Telangana: కేసీఆర్ వంద స్థానాల్లో ప్రచారం చేస్తారు: కేటీఆర్
తెలంగాణలో ఎన్నిపార్టీలు పోటీ చేసినా ఈ ఎన్నికల్లో గెలిచేది మాత్రం బీఆర్ఎస్సేనని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ వంద స్థానాల్లో ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ (BRS)కు గతంలో లాగా 88 సీట్లు రాకపోయినా హుజూరాబాద్‌లో తామే గెలుస్తామని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ వంద స్థానాల్లో ప్రచారం చేస్తారని, తాను గ్రేటర్ హైదరాబాద్, సిరిసిల్ల, కామారెడ్డిలలో మాత్రమే ప్రచారం చేయనున్నట్లుగా వెల్లడించారు.
బీఆర్ఎస్ మేనిఫెస్టోలో రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు, పెన్షనర్లకు పెద్ద పీట వేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ స్వతంత్రంగానే పని చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తాను సిరిసిల్లలో ఓటర్లకు మద్యం, డబ్బులు పంపినీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 2004, 2009 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని ఇప్పటి వరకూ నిలబెట్టుకోలేదని విమర్శించారు.
ఈటెల రాజేందర్ హుజూరాబాద్‌తో పాటు కేసీఆర్‌పై పోటీ చేస్తానన్న వ్యాఖ్యలపై కేటీఆర్ వ్యంగ్యంగా మాట్లాడారు. ఈటల గజ్వేల్‌తో పాటు మరో యాభై చోట్ల పోటీ చేసినా తమకు అభ్యంతరం లేదని, షర్మిల 119 సీట్లలో పోటీ చేసినా, రాహుల్ గాంధీ, నరేంద్రమోదీ ఇక్కడకు వచ్చినా తమకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు.
తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి నలభై చోట్ల అభ్యర్థులే లేకపోయినా 70 సీట్లు గెలుస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బీఆర్ఎస్ (BRS) పార్టీయే తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. మూడోసారి తాము అధికారంలోకి వచ్చి ప్రజల రుణాన్ని తీర్చుకుంటామన్నారు.