»Etala Rajenders Key Announcement Competition From Gajwel Against Cm Kcr
Telangana: ఈటల కీలక ప్రకటన..సీఎం కేసీఆర్‌పై గజ్వేల్ నుంచి పోటీ
తెలంగాణ సీఎం కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్ నియోజకవర్గం నుంచే తాను కూడా పోటీ చేయనున్నట్లు బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రకటించారు. అటు హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్ నుంచి రెండు ప్రాంతాల్లో తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు.
తెలంగాణలో ఈసారి ఎన్నికలు మరింత హీటెక్కాయి. బీజేపీ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఎన్నికల నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తాను సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తున్నానని తన కార్యకర్తల సమక్షంలో వెల్లడించారు. ప్రస్తుతం ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు ప్రాంతాల నుంచి పోటీ చేయనున్నట్లు ఇది వరకే తెలిపారు. సీఎం కేసీఆర్ పోటీ చేసే నియోజకవర్గాల్లో గజ్వేల్ కూడా ఉంది. తాజాగా ఈటల రాజేందర్ కూడా ఆ గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్‌ను ఢీకొట్టనున్నట్లు ప్రకటించారు. గురువారం హుజూరాబాద్ లో ఆయన ముఖ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమక్షంలో ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈసారి ఎన్నికల్లో హుజూరాబాద్ కార్యకర్తలే తనను ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ లాగే తాను కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. రెండింట్లోనూ విజయం తనదేనని ధీమాను వ్యక్తం చేశారు. అయితే ఈటల ప్రకటనపై బీజేపీ అధినాయకత్వం ఇప్పటి వరకూ స్పందించలేదు. ప్రస్తుతం ఈటల వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.