»Hyderabad Has Broken Mumbais Record As The City With The Most Luxury Houses In The Country
Hyderabad: దేశంలోనే అత్యంత లగ్జరీ ఇళ్లు కలిగిన నగరంగా హైదరాబాద్..ముంబై రికార్డు బ్రేక్
హైదరాబాద్ మహానగరం ఇప్పుడు మరో ఘనతను సాధించింది. దేశంలోనే అత్యంత విలాసవంతమైన నగరాల్లో భాగ్యనగరం తొలిస్థానంలో నిలిచింది. 14,350 ఇళ్లు హైదరాబాద్ లోనే ఉండటం విశేషం.
హైదరాబాద్ (Hyderabad) నగరం మరో ఘనతను సాధించింది. దేశంలోనే అభివృద్ధి చెందుతున్న నగరాలతో భాగ్యనగరం పోటీపడుతూ ఉంది. తాజాగా దేశంలోనే అత్యంత లగ్జరీ ఇళ్లు కలిగిన నగరాల జాబితాలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటికే దేశంలోనే నివాసయోగ్యం అయిన నగరాల్లో హైదరాబాద్కు ప్రత్యేక స్థానం అనేది ఉంది. ఇప్పుడు అత్యంత ఖరీదైన ఇళ్లు కూడా హైదరాబాద్లోనే ఉన్నట్లు తేలింది. అనారక్ (ANAROCK) అనే సంస్థ దేశంలోని ఏయే నగరాల్లో ఎన్ని లగ్జరీ ఇళ్లు కలిగి ఉన్నాయనే వివరాలను సేకరించి డేటాను విడుదల చేసింది.
2023లో అనారక్ (ANAROCK) అనే సంస్థ దేశంలోని టాప్ 7 ముఖ్య నగరాలను తీసుకుని, అందులోని లగ్జరీ ఇళ్ల గురించి వివరాలను సేకరించింది. అందులో హైదరాబాద్లో అత్యంత ఎక్కువగా 14,350 లగ్జరీ ఇళ్లు ఉన్నట్లు నివేదించింది. 2018లో ఈ డేటాను చూస్తే కేవలం 210 ఇళ్లు మాత్రమే హైదరాబాద్లో ఉండేవి. ఇకపోతే ఈ జాబితాలో హైదరాబాద్ నగరం తర్వాత రెండో స్థానంలో ముంబై 7830 ఇళ్లతో ఉంది. న్యూ ఢిల్లీలో 3870, పూణె 1940, బెంగుళూరు 1710, కోల్కతా 1030, చెన్నై 460 విలాసవంతమైన ఇళ్లతో ఉంది.
దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై (Mumbai) మహానగరం కంటే ఇప్పుడు హైదరాబాద్ లోనే ఎక్కువ విలాసవంతమైన గృహాలు ఉండటం విశేషం. దేశవ్యాప్తంగా చూస్తే మొత్తం 31,180 విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. అందులో 14,350 ఇళ్లు భాగ్యనగరంలోనే ఉన్నట్లు ఆ నివేదిక తెలిపింది. గత ఐదేళ్లలోనే హైదరాబాద్లో అత్యధిక ఇళ్ల నిర్మాణాలు జరిగాయని అనారక్ (ANAROCK) గ్రూప్ రీజినల్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు.