ఈ రోజు రాజమౌళి అంటే ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్. ఆయనంటే ప్రపంచంలో తెలియని వారుండరు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియచేసిన రాజమౌళి.. అక్టోబర్ 10న పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు.
Rajamouli: ఓ సీరియల్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టి.. రెండు దశాబ్దాల్లో ఇండియా బిగ్గెస్ట్ డైరెక్టర్ అవుతాడని ఎవ్వరు కూడా ఊహించి ఉండరు. కలలో కూడా హాలీవుడ్ డైరెక్టర్స్ మన దర్శకుల గురించి మాట్లాడతారని.. ఇంటర్య్వూలు ఇస్తారని ఊహించి ఉండరు. అది కూడా జేమ్స్ కామెరాన్, స్పీల్ బర్గ్ లాంటి దర్శకులు రాజమౌళి మేకింగ్‌కు ఫిదా అయిపోయారంటే.. దర్శక ధీరుడు రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు యావత్ ప్రపంచం తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తోంది అంటే.. అది కేవలం రాజమౌళి వల్లే. బాహుబలి అనే ప్రాజెక్ట్ రాజమౌళి చేసి ఉండకపోతే.. పాన్ ఇండియా సినిమాలు ఉండకపోయేవి.. టాలీవుడ్ హాలీవుడ్ లెవల్‌కి వెళ్లకపోయేది.. ట్రిపుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ వచ్చి ఉండేది కాదు.
రాజమౌళి జర్నీ చూస్తే… మొదట తండ్రి విజయేంద్ర ప్రసాద్ దగ్గర రచయితగా పని చేశారు. 2000 సంవత్సరంలో ‘శాంతి నివాసం’ సీరియల్ ద్వారా దర్శకుడిగా మారారు. 2001లో ఎన్టీఆర్ ‘స్టూడెంట్ నంబర్ 1’తో సినీ దర్శకుడిగా జర్నీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ‘సింహాద్రి’, ‘సై’, ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’, ‘యమదొంగ’, ‘మగధీర’, ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ వంటి సినిమాలు చేసి వరుసగా విజయాలు అందుకున్నారు. ఇక బాహుబలితో తెలుగు సినిమా సత్తాను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారు. ‘బాహుబలి-2’ ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటికీ భారతదేశంలో అత్యధిక వసూళ్లు చూసిన చిత్రంగా బాహుబలి2నే ఉంది. ఈ సినిమాను ‘దంగల్’ బీట్ చేసిందంటూ.. 2000 కోట్లకు పైగా రాబట్టిందని ప్రచారం చేసినప్పటికీ.. వసూళ్ళలో ‘బాహుబలి-2’దే పైచేయి.
ఆర్ఆర్ఆర్తో 1200 కోట్లకు పైగా రాబట్టి.. బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల దర్శకుడిగా టాప్ ప్లేస్‌లో నిలిచాడు జక్కన్న. ఆస్కార్ రాబట్టి చరిత్ర తిరగరాశాడు. నెక్స్ట్ మహేష్ బాబుతో హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ రోజు అక్టోబర్ 10న 50వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు దర్శక ధీరుడు. దీంతో.. సోషల్ మీడియాలో #HBDSSRajamouli.. #SSMB29.. “Pride of Indian Cinema” ట్యాగ్స్ టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఎస్ఎస్ఎంబీ 29 నుంచి ఒక్క అప్టేట్ వచ్చి ఉంటే.. ఈపాటికే సోషల్ మీడియా తగలబడిపోయేది. మరి నెక్స్ట్ బర్త్ డే వరకు మహేష్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుందేమో చూడాలి.