AP Liquor Scam: దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతోన్న మద్యం కుంభకోణం కళ్లకు కనిపించడం లేదా అని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandra Mohan Reddy) మండిపడ్డారు. గత నాలుగేళ్లలో రూ.28 వేల కోట్ల మేర జరిగిన మద్యం అమ్మకాలకు సంబంధించి లెక్కలు లేవన్నారు. ఏపీ ఎక్సైజ్ లిక్కర్ సేల్స్ వెబ్ సైట్ ఎందుకు మూసేశారని అడిగారు. రాష్ట్రంలో వెయ్యి కోట్ల కుంభకోణం జరుగుతోంది.. ఈడీ, సీబీఐ ఎందుకు కేసు ఫైల్ చేయడం లేదని అడిగారు. విజయవాడలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
నాసిరకం మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు తీసేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandra Mohan Reddy) విరుచుకుపడ్డారు. మద్యంతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. జగనన్న సురక్ష అంటూ ప్రజల వద్దకు వస్తారా అని నిలదీశారు. ఏపీలో లిక్కర్ స్కామ్, ఇసుకలో స్కామ్ జరుగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే మద్యం విక్రయిస్తోంది. షాపుల వద్ద నగదు మాత్రమే తీసుకుంటున్నారు. డిజిటల్ పేమెంట్స్ తీసుకోవడం లేదు. మద్యం ద్వారా వచ్చిన నగదు ప్రభుత్వ ఖాజానాలోకి కాకుండా.. సీఎం జగన్ ఖాతాలోకి వెళుతుందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు అదే విషయాన్ని సోమిరెడ్డి ప్రస్తావించారు.