తాము అధికారంలోకి వస్తే వైసీపీ అంతుచూస్తామని, రాబోయేది టీడీపీ, జనసేన ప్రభుత్వమని పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా ఆయన సీఎం జగన్‌పై, వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది టీడీపీ, జనసేనే అని పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముదినేపల్లి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. మొన్న తనను పంచాయతీ సర్పంచులు కలిశారని, జగన్ రూ.8,600 కోట్ల నిధులు దారిమళ్లించేశారని వాపోయినట్లు వెల్లడించారన్నారు. జగన్ రూ.1200 కోట్ల మేర భవన నిర్మాణ కార్మికుల నిధిని కూడా కాజేశాడని ఆరోపణలు చేశారు.
జగన్, వైసీపీ నేతలంతా కూడా ఏ రోజైనా జేబులోంచి ఒక్క రూపాయి కూడా బయటికి తీయలేదని, ప్రజల కోసం తమ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టలేదని పవన్ ప్రశ్నించారు. తాను కష్టపడి సంపాదించిన సొమ్మును కౌలు రైతుల కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక మహిళలు కోరుకున్న చోట మద్య నిషేధం అమలు చేస్తామన్నారు. తమ ప్రభుత్వం వస్తే నాణ్యమైన మద్యం అందిస్తామని, మద్యం ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు.
మరో ఆరు నెలల తర్వాత ఏపీలో టీడీపీ, జనసేన ప్రభుత్వం వస్తుందని, టీడీపీ, జనసేన కలవడం వల్ల వైసీపీ భయపడుతోందన్నారు. రాష్ట్రంలో ప్రజలను కులాల వారీగా విభజిస్తామంటే తాము చూస్తూ ఊరుకోమన్నారు. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేస్తానన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆరు నెలల్లోనే కైకలూరు నీటి సమస్యను తీరుస్తానన్నారు.