శ్రీదేవి సడెన్ గా ఎందుకు చనిపోయిందో అర్థం కాలేదు. కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయిందని చెప్పారు. ఆమె మరణం విషయంలో బోనీ కపూర్ పై కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా మొదటిసారి ఆయన ఆమె మరణంపై నోరు విప్పారు. శ్రీదేవిది సహజ మరణం కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించడం విశేషం.
బోనీ కపూర్ మాట్లాడుతూ.. శ్రీదేవిది సహజ మరణం కాదని, ప్రమాదవశాత్తు చోటుచేసుకున్న మరణం అని తెలిపారు. అయితే ఈ సందర్భంగా శ్రీదేవికి సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టారు. అందంగా కనిపించడం కోసం ఆమె కఠినమైన డైట్‌ని ఫాలో అయ్యేదట. పెళ్లి తర్వాత ఆ విషయం తనకు తెలిసిందని బోనీ కపూర్ తెలిపారు. ఆమె ఉప్పు లేకుండా భోజనం చేసేదట. దీని కారణంగా చాలాసార్లు ఆమె నీరసించిపోయేదని వెల్లడించారు. అంతేకాదు లో బీపీ సమస్య తలెత్తేదని, చాలా సార్లు ఆమె కళ్లు తిరిగేదని ఆయన వెల్లడించారు.
అయితే ఈ విషయంలో చాలా కేర్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా తను సీరియస్‌గా తీసుకోలేదని, శ్రీదేవిది సహజ మరణం కాదని, ఆమె ప్రమాదవశాత్తు మరణించిందని చెప్పారు. దీంతో దుబాయిలో పోలీసులు తనని ఓ రోజంతా విచారించారని, లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేశారని, భారత మీడియా నుంచి ఒత్తిడి కారణంగా తనని పోలీసులు అన్ని విధాలుగా పరీక్షించినట్టు చెప్పారు. శ్రీదేవి చనిపోయిన కొన్ని రోజులకు నాగార్జున ఓ సారి కలిశారని, డైట్ కారణంగా ఓ సారి సినిమా సెట్ లో కూడా శ్రీదేవి స్పృహ తప్పి పడిపోయినట్టు చెప్పాడని బోనీ కపూర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.