UttarPradesh: రూ.20 కోసం బాలికను హత్య చేసిన యువకుడు!
ఓ వ్యక్తి రూ.20 కోసం బాలికను హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. పాన్ మసాల తీసుకురమ్మంటే ఆ బాలిక చిప్స్ ప్యాకెట్ కొనుక్కుందని ఆగ్రహంతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు.
రూ.20ల కోసం ఓ యువకుడు బాలికను హత్య చేశాడు. పాన్ మసాలా తీసుకురమ్మని ఆ బాలికకు రూ.20లు ఇచ్చి పంపితే ఆమె చిప్స్ కొనుక్కుందని ఆగ్రహంతో రెచ్చిపోయాడు. ఆ బాలికను దారుణంగా హింసించి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..అలీఘర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన పొరిగింటిలో నివశిస్తున్న ఆరేళ్ల బాలికను కొట్టి చంపడం కలకలం రేపింది.
కాలనీలో నివశిస్తున్న బాలిక రాత్రి నుంచి కనిపించకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కలంతా వెతికారు. ఎంతకీ కనపడకపోవడంతో బాలిక అదృశ్యమవ్వడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు బాలిక నివాసానికి దగ్గర్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. అందులోని ఓ కెమెరాలో బాలిక ఉన్నట్లు రికార్డ్ అయ్యింది. తన పొరిగింటికి ఆ బాలిక వెళ్లినట్లు అందులో ఉంది. అనుమానం వచ్చిన పోలీసులు ఆ ఇంటికి వెళ్లి సోదాలు చేయగా బాలిక మృతదేహం కనిపించింది.
పోలీసులు బాలిక పక్కింటి వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించారు. పోలీసుల విచారణలో నిజం ఒప్పుకున్నాడు. బాలికను తానే చంపినట్లుగా ఒప్పుకున్నాడు. బాలికకు రూ.20 ఇచ్చి పాన్ మసాలా తీసుకురమ్మంటే చిప్స్ కొనుక్కుందని, ఆ కోపంలో బాలిక గొంతు కోసి చంపినట్లు తెలిపాడు. బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి రిపోర్ట్ వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని నగర ఎస్పీ మృగాంక్ శేఖర్ వెల్లడించారు.