స్కిల్ స్కామ్‌లో సీఐడీ దూకుడు కొనసాగుతోంది. రెండో రోజు చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించింది. కిలారు రాజేశ్ షెల్ కంపెనీల నిధులను లోకేశ్‌కు పంపించారని తెలిసింది.
Rajesh: స్కిల్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబుపై సీఐడీ అధికారులు రెండో రోజు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు విచారించి.. ఆ తర్వాత ఏసీబీ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట వర్చువల్‌గా హాజరు పరుస్తారు. స్కామ్ గురించి మరికొంత సమాచారం సేకరించాల్సి ఉందని రిమాండ్ కోరే అవకాశం ఉంది. స్కిల్ స్కామ్‌లో నిధుల మళ్లింపు గురించి చంద్రబాబుపై సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో నారా లోకేశ్ పీఏ కిలారు రాజేశ్ (Rajesh) గురించి ప్రస్తావించారు. షెల్ కంపెనీల నుంచి నిధులను రాజేశ్, లోకేశ్‌కు పంపించాడని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో లిస్ట్‌లో రాజేశ్ పేరును సీఐడీ అధికారులు చేర్చారని తెలిసింది.
సీఐడీ కస్టడీలో చంద్రబాబు విచారణతో కిలారు రాజేశ్ మెల్లిగా జారుకున్నట్టు తెలుస్తోంది. లోకేశ్‌తో ఢిల్లీలో ఉండగా.. నిన్న విదేశాలకు వెళ్లినట్టు తెలుస్తోంది. సింగపూర్, లేదంటే అమెరికా వెళ్లారని సమాచారం. రాజేశ్‌ను లోకేశ్ పంపించారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. స్కిల్ స్కామ్‌లో షెల్ కంపెనీల నిధులను లోకేశ్‌కు రాజేశ్ మళ్లించాడట. ఇదే కాదు లోకేశ్‌కు సంబంధించిన అన్ని ఆర్థికపర వ్యవహారాలను రాజేశ్ చూసుకుంటాడు. యువగళం యాత్రలో కూడా రాజేశ్ కీ రోల్ పోషించాడు. చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్‌లో ఈ వివరాలను సీఐడీ పేర్కొంది. ఐటీ నోటీసుల్లో కూడా రాజేశ్ పేరు ఉంది.
అమరావతి కాంట్రాక్ట్‌ల్లో బ్లాక్ మనీ తరలించారనే ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయాన్ని ఐటీ నోటీసుల్లో పేర్కొన్నారు. చంద్రబాబు కస్టడీ విచారణలో సీఐడీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. దీనిని బట్టి స్కిల్ స్కామ్‌లో రాజేశ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అలాగే లోకేశ్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో ఆయన ఢిల్లీలో ఉన్నారనే విమర్శలు వస్తున్నాయి.