Mira: మీరా ఆంటోని (Mira) మృతితో తండ్రి, నటుడు విజయ్ ఆంటోని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మీరా మృతి తర్వాత సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. కూతురు మీరాతోపాటు తాను కూడా చనిపోయానని రాసుకొచ్చారు. ప్రపంచం కంటే మెరుగైన ప్రదేశానికి పెద్ద కూతురు వెళ్లింది. మీరా ఎంతో ప్రేమగా ఉండేది. ధైర్యంగా ఉంటుంది. కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, ద్వేషం లేని ప్రశాంతమైన ప్రదేశంలోకి వెళ్లింది. తాను వెళ్లినప్పటికీ.. ఇప్పటికీ తనతో మాట్లాడుతోంది. మీరాతోపాటు తను చనిపోయాను. ఆమెతో సమయం గడపడం ప్రారంభించాను. ఇకపై తాను చేసే ప్రతీ సేవా కార్యక్రమాన్ని మీరా పేరుతో ప్రారంభిస్తాను’ అని విజయ్ ఆంటోనీ ట్వీట్ చేశారు.
విజయ్ షేర్ చేసిన పోస్ట్ ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. కూతురుపై ఆయనకు ఉండే ప్రేమను చాటుతోంది. 12వ తరగతి చదువుతోన్న మీరా.. ఒత్తిడికి గురై తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పేరంట్స్కు కడుపుకోత మిగిల్చింది. మీరా మృతి తర్వాత పిల్లలతో తల్లిదండ్రులు నడుచుకునే విధానం, సమయం ఇవ్వకపోవడం లాంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. అంతకుముందు మీరా సూసైడ్ నోట్ గదిలో దొరికింది. అందులో తన స్నేహితులు, టీచర్స్‌ను మిస్ అవుతున్నానని తెలిపింది. తన మృతితో కుటుంబం బాధపడుతోందని రాసుకొచ్చింది. లవ్ యూ ఆల్.. మిస్ యూ ఆల్ అని రాసింది. మీరా ఆత్మహత్య చేసుకుందని పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు ధృవీకరించారు.
విజయ్ ఆంటోని బిచ్చగాడు మూవీతో ఫేమ్ అయ్యారు. బిచ్చగాడు-2, నకిలీ లాంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2006లో ఫాతిమాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు కాగా.. పెద్ద కూతురు మీరా ఇటీవల సూసైడ్ చేసుకున్నారు. మీరా మృతితో విజయ్ దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ లాంటి పరిస్థితి పగవాడికి కూడా రావొద్దని అంటున్నారు.