ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ విజయవంతంగా జరిగింది. మంత్రి కేటీఆర్ మాత్రం కనిపించలేదు. జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత జరిగిన తొలి బహిరంగ సభకు దూరంగా ఉన్నారు. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారు. ఆయనతోపాటు అల్లుడు, మంత్రి హరీశ్ రావు కూడా వెళ్లక తప్పేట్టు లేదని ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత ఒకరు పేర్కొన్నారు. రాష్ట్రంలో సీఎం పదవీని కేటీఆర్‌కు అప్పగిస్తారని తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో హరీశ్ రావుకు బాధ్యతలు అప్పగిస్తారని తెలిసింది. అందుకోసమే ఖమ్మం సభలో హరీశ్ అన్నీ తానై నడిపించారు. స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నా.. ట్రబుల్ షూటర్ స్థానం వేరే. దీంతో అతనికి పార్టీ జాతీయ స్థాయిలో పదవీ ఖాయం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కేటీఆర్ దూరం, దూరం..
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ పనిచేశారు. పార్టీ బీఆర్ఎస్గా మారిన కీలక సమయంలో దూరంగా ఉన్నారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం, తర్వాత నిర్వహించిన యాగం కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు. ఇటీవల తోట చంద్రశేఖర్‌కు ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పదవీ బాధ్యతలను అప్పగించారు. ఆ సమయంలో కనిపించలేదు. ఖమ్మం సభ వేదికను పంచుకోలేదు. కల్వకుంట్ల కవిత మాత్రం యాక్టివ్‌గా ఉన్నారు. భారత జాగృతితో బీఆర్ఎస్కు మద్దతుగా పలు రాష్ట్రాల్లో కార్యక్రమాలు చేపడుతున్నారు. హరీశ్ రావు గురించి అయితే చెప్పక్కర్లేదు. కేటీఆర్‌కు సీఎం పదవీ అప్పగించాలని కేసీఆర్ చూస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకోసమే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నాయి.
హరీశ్‌కు పార్టీ బాధ్యతలు
బీఆర్ఎస్ జాతీయ పార్టీకి కేసీఆర్ అధ్యక్షుడిగా, రాష్ట్రంలో పార్టీని ఒకరికి అప్పగిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవీని హరీశ్ రావుకు అప్పగిస్తారని తెలుస్తోంది. దీంతో కేటీఆర్‌ను సీఎం పీఠంపై కూర్చొబెట్టే పని మరింత సులువు అవుతుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఆ పని జరగకపోవచ్చు. ఎందుకంటే నవంబర్, డిసంబర్ నెలలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. 10 నెలల సమయంలో సీఎంను మార్చే సాహసం కేసీఆర్ చేయకపోవచ్చు. పార్టీని విస్తరిస్తూనే.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధించిన తర్వాత కేటీఆర్‌ను సీఎం చేసే అవకాశం ఉందని పొలిటికల్ ఆనలిస్టులు అంచనా వేస్తున్నారు.
సీఎం పోస్ట్ ఖాయం
ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో విజయంపై బీఆర్ఎస్ ధీమాతో ఉంది. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా నిలుస్తాయని అంటోంది. అందుకోసమే కేసీఆర్ పార్టీ విస్తరణ కోసం సమయం కేటాయించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. ఇటు పార్టీ విస్తరణ జరుగుతుంది.. అటు కుమారుడికి సీఎం పదవీ కట్టబెట్టినట్టు అవుతుందని విశ్లేషకులు ఉదహరణలతో సహా వివరిస్తున్నారు. తనకు ఎలాగు సీఎం పోస్ట్ దక్కుతుందని భావించి.. కేటీఆర్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. ఆ సమయంలో తాను బిజీగా ఉండేలా చూసుకుంటున్నారని చెబుతున్నారు.