భారత్ (Bharath)లోని ఢిల్లీలో జీ20 (G20) శిఖరాగ్ర సదస్సు ఈ నెల 9, 10వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు 20 దేశాధినేతలు హాజరుకానున్నారు. దీంతో కేంద్రం భద్రతా సిబ్బందిని, సాంకేతిక నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. అయితే ఆయా దేశాల నేతలు భారత్ అందించే భద్రతతో పాటుగా తమ సొంత సెక్యూరిటీని కూడా మన దేశంలో ఏర్పాటు చేసుకుంటున్నారు. అందుకే ప్రధాన ఆకర్షణగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రయాణించే ది బీస్ట్ (Beast Car) కారు నిలువనుంది.
సెప్టెంబర్ 7వ తేదిన జో బైడెన్ (Joe Biden) భారత్‌కు రానున్నారు. 8వ తేదిన ద్వైపాక్షిక భేటీలో పాల్గొంటారు. బైడెన్ ఆకాశంలో ప్రయాణించేందుకు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంతో పాటుగా రోడ్డుపై ప్రయాణించేందుకు దిబీస్ట్ కారును వాడనున్నారు. ప్రపంచంలోనే ఆ కారుకు అనేక విశిష్టతలు ఉన్నాయి. ‘ది బీస్ట్’ కారును కాడిలాక్ వన్, ఫస్ట్ కార్ అని కూడా అంటారు. దీనిని 2018లో అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్‌లోకి తీసుకున్నారు.
ఈ కారు లేటెస్ట్ ఫీచర్లతో పాటుగా అత్యంత భద్రతా ప్రమాణాలతో తయారు చేశారు. అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా బీస్ట్ కారు (Beast Car) కూడా అక్కడికి వెళ్లాల్సిందే. ఆ కారు అద్దాలు 5 ఇంచుల మందంతో ఉంటాయి. డోర్లు 8 ఇంచుల మందంతో ఉంటాయి. గాజు, పాలీకార్బొనేట్లతో కూడిర ఐదు లేయర్లతో ఈ అద్దాలు రెడీ చేశారు. కారులో కేవలం డ్రైవర్ విండో మాత్రమే 3 ఇంచులు తెరుచుకుంటుండగా మిగిలిన అద్దాలేవీ తెరుచుకోవు. కారు మొత్తం కూడా బుల్లెట్ ప్రూఫ్‌తో ఉంటుంది. ఈ కారు రసాయన, జీవాయుధ, బాంబు దాడులను సైతం తట్టుకుంటుంది.
కారు (Beast Car) టైర్లు పగిలిపోకుండా, పంక్చర్ కాకుండా ఉంటాయి. ఒక వేళ ఆ కారు డ్యామేజ్ అయితే అందులోని స్టీల్ రీమ్లతో అది వెళ్తుంది. స్టీల్, అల్యూమినియం, టైటానియం, సిరామిక్‌తో ది బీస్ట్ కారును తయారు చేశారు. ఇందులో బయటి నుంచి గాలి కూడా వెళ్లదు. కారులోనే ఆక్సిజన్ ఉంటుంది. అలాగే అధ్యక్షుడి బ్లడ్ గ్రూప్ బ్యాగులు కూడా ఉంటాయి. దీనిని సాధారణ డ్రైవర్లు నడపలేరు. బీస్ట్ డ్రైవర్‌కు అమెరికా సీక్రెట్ సర్వీస్ శిక్షణ ఇస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ కారు జీ20 సందర్భంగా భారత్‌కు రానుంది.