Miss Shetty Mr Polishetty: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ రివ్యూ
చాలా కాలం తరువాత అనుష్క, జాతిరత్నాలు వంటి సూపర్ హిట్ తరువాత నవీన్ పొలిశెట్టి ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పించిందో చుద్దాం.
Miss Shetty Mr. Polishetty Anushka shetty Naveen Polishetty
చిత్రం: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి నటీనటులు : అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, మురళీ శర్మ, జయసుధ, అభినవ్ గోమఠం, సోనియా దీప్తి, తులసి, నాజర్ తదితరులు దర్శకత్వం : మహేష్ బాబు పి. నిర్మాతలు : వంశీ – ప్రమోద్ సినిమాటోగ్రఫీ : నిరవ్ షా సంగీతం : గోపి సుందర్, రధన్ విడుదల: 07/09/2023
బ్యూటిఫుల్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) ఐదేళ్ల తర్వాత మళ్లీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(Miss Shetty Mr Polishetty) చిత్రంతో వెండితెరపై అలరించింది. జాతి రత్నాలు వంటి సూపర్ డూపర్ హిట్ తరువాత నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కింది. కాబట్టి తగినంత పబ్లిసిటీతో ఈ సినిమా (miss shetty mr polishetty review) ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ
అన్విత ఆర్.శెట్టి (అనుష్క) ఒక షెఫ్. పెళ్లి అంటే తనకు మంచి అభిప్రాయం లేదు. తల్లి (జయసుధ) మరణం తర్వాత ఒంటరితనంగా ఫీలవుతుంది. తనకు ఓ తోడు కావాలని, ఆ తోడు తన బిడ్డ అవ్వాలని అనుకుంటుంది. పెళ్లి చేసుకోకుండా లీగల్ ప్రొసీజర్ ద్వారా బిడ్డకు జన్మనివ్వాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నాల్లో ఉన్న ఆమె ఓ రోజు సిద్దు పోలిశెట్టి (నవీన్ పోలిశెట్టి) స్టాండప్ కామెడీ షో చూస్తుంది. అతనే తన బిడ్డకు తండ్రి కావాలని ఆశిస్తుంది. అలా సిద్దుకు దగ్గరవుతుంది అన్విత. ఆ ప్రాసెస్‌లో సిద్దు ఆమెతో ప్రేమలో పడతాడు. ఓ రోజు సినిమాటిక్ స్టైల్ లో ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు అన్విత చెప్పిన సమాధానం విని షాక్ అవుతాడు. పెళ్లి కాకుండా పిల్లల్ని కనడం సమాజానికి విరుద్ధమని తన అభిప్రాయాలు చెబుతాడు. దాంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్విత దేశం వదిలి లండన్ ఎందుకు వెళ్ళింది? అసలు, ఆమె చివరకు తల్లి అయ్యిందా? లేదా? లండన్ వెళ్లిన తర్వాత ఏం జరుగుతుంది? చివరకు ఇద్దరూ కలిశారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎలా ఉంది
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి(miss shetty mr polishetty review) కథలో పెద్దగా చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. పెళ్లి కాకుండా తల్లి కావాలనుకున్న ఓ మహిళ ఏం చేసింది. ఆ క్రమంలో ఆమెకు ఎటువంటి అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఏమైంది. అనేది ఈ సినిమా కథ. అయితే కథలో కామెడీ, పాటలు, ఎమోషన్స్ చాలా చక్కగా కుదిరాయి. పెళ్లి కాకుండా ఓ మహిళ ప్రెగ్నెంట్ కావడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. మహేష్ బాబు ఎక్కడా హద్దు మీరలేదు. కుటుంబం అంతా కలిసి చూసే చక్కటి వినోదాన్ని అందించారు.
సినిమా ప్రారంభం మాములుగా ఉంటుంది. అనుష్క, జయసుధ మధ్య బాండింగ్ ఆ సీన్లు రొటీన్. హీరో, అతని తండ్రి మధ్య సీన్లలో కూడా కొత్తదనం లేదు. హీరో ఆఫీస్ సీన్లలో కామెడీ కోటింగ్‌తో బాగానే ఉంటుంది. పతాక సన్నివేశాల్లో ఎమోషన్స్ బాగా కుదిరాయి. తనలో భయాల గురించి అనుష్క చెప్పే సీన్ కంటతడి పెట్టిస్తుంది. ఫస్టాఫ్‌లో కొంత నిడివి తగ్గిస్తే బావుండేది. అయితే ఇది రెగ్యులర్ రొటీన్ లవ్ స్టోరీ కాదు. కానీ చివరకు వచ్చేసరికి ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి. హీరో హీరోయిన్లు కలవాలని ప్రేక్షకుడు కోరుకునేలా ఉంటుంది. మొత్తానికి ఫ్యామిలీతో అలా సరదాగా చూసేయచ్చు.
ఎవరెలా చేశారు
సినిమా ప్రారంభంలో అనుష్క(Anushka Shetty) పాత్ర సాధారణంగా ఉంటుంది. ఏ దశలోనూ పాత్రను డామినేట్ చేయాలని చూడలేదు. లండన్ నుంచి భారత్ వచ్చిన అమ్మాయి రోల్ హద్దులు మీరలేదు. హుందాగా కనిపించింది. పతాక సన్నివేశాల్లో నటిగా తన టాలెంట్ చూపించారు అనుష్క. భావోద్వేగ భరిత సన్నివేశాల్లో ఆమె అభినయంతో మహిళల మనసులను తాకుతుంది. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ మరోసారి ఆకట్టుకుంటుంది. స్టాండప్ కామెడీలో తనకు తిరుగు లేదన్నట్లు కొన్ని సన్నివేశాల్లో విపరీతంగా నవ్వించారు. ముఖ్యంగా సెకండాఫ్ అంతా స్టాండప్ కామెడీ సీన్లు బావున్నాయి. ఎమోషనల్ సీన్స్ కూడా చక్కగా చేశారు. సినిమా ప్రారంభమైన 15 నిమిషాల్లో జయసుధ పాత్ర ముగుస్తుంది. అనుష్కకు తల్లిగా, బాలకృష్ణ వీరాభిమానిగా ఆమె కనిపించారు. నాజర్(Nazar), మురళీ శర్మ(Murali Sharma), తులసి(Thulasi) సినిమాలో వీరి పాత్రలు వాళ్ళ అనుభవం ముందు చిన్నవి అయినా మెప్పించారు. హీరో స్నేహితుడిగా అభినవ్ గోమఠం ఓకే.
సాంకేతికతలు
సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. పాటలు ఎక్కువగా మాంటేజ్లే. ఈ విషయంలో సినిమాటోగ్రఫర్ నిరవ్ షా తన ట్యాలెంట్‌ను అంతా చూపించి విజువల్‌గా అబ్బురపరిచారు. అలాగే సినిమాకు ప్రాణం పోసిన నేపథ్య సంగీతాన్ని అందించిన గోపి సుందర్, బాణీలతో దుమ్ములేపిన రధన్ ఇద్దరు కలిసి మ్యాజిక్ చేశారు. ఎడిటర్ ఇంకాస్త చురుగ్గా పనిచేస్తే బాగుండేది. ముఖ్యంగా స్టాండప్ కామెడీలో వచ్చే వన్ లైనర్స్ చాలా బాగున్నాయి. మొత్తానికి డైరెక్టర్ తన పనితనాన్ని చూపించారు. అందరు మంచి నటులే కాబట్టి వారి నుంచి తనకు ఏం కావాలో అదే తెరపై చూపించారు. ఈ విషయంలో దర్శకుడు ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నాడు.