తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ఆంధ్రప్రదేశ్ లో చిచ్చు రేపింది. దావోస్ లో ప్రపంచ ఆర్థిక ఫోరమ్ వార్షిక సదస్సు జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు జరుగుతుంది. దీనికి మంత్రి కేటీఆర్ తన టీమ్ తో హాజరయ్యాడు. అక్కడ తెలంగాణ పెవిలియన్ ఏర్పాటుచేశారు. ప్రభుత్వ విధానాలు వివరిస్తూ తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వివిధ కంపెనీలు, పారిశ్రామికవేత్తలను కోరుతున్నారు. ఈ కేటీఆర్ పర్యటనకు అనూహ్య స్పందన వస్తోంది. తొలి రెండు రోజుల్లోనే ప్రతిష్ఠాత్మక సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే ఇదే ఆంధ్రప్రదేశ్ లో చిచ్చు రాజుకోవడానికి కారమైంది.
పక్క రాష్ట్ర మంత్రి పర్యటనను చూసి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం, అధికార పార్టీ వైఎస్సార్ సీపీలు విమర్శలు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ను విమర్శిస్తూ టీడీపీ పోస్టులు చేసింది. దావోస్ సదస్సు ఆహ్వానం ఏపీకి రాలేదని, ఐటీ శాఖ మంత్రి అమర్ నాథ్ ఉండి ఏం ప్రయోజనం లేదని విమర్శలు మొదలయ్యాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ పరిశ్రమల కోసం పరితపిస్తుంటే.. సీఎం జగన్ పాలనతో ఉన్న పరిశ్రమలు దివాళా తీస్తున్నాయని టీడీపీ నేతలు ఆరోపించారు.
ఏపీ మంత్రి స్పందన
అయితే దీనిపై మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి దావోస్ సదస్సు ఆహ్వానం నవంబర్ 25న అందిందని రెండు లేఖలను చూపించారు. అయితే ఈ ఏడాది మార్చిలో విశాఖపట్టణం వేదికగా గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ సదస్సుకు ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజాలను ఆహ్వానించాలనే ఉద్దేశంతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలోనే ఆ సదస్సుకు హాజరు కాలేదని వివరణ ఇచ్చారు.
అయితే కప్పి పుచ్చుకునే వ్యవహారం జగన్ కే చెల్లిందని టీడీపీ ఎద్దేవా చేస్తోంది. జగన్ సీఎంగా రాష్ట్రానికి పరిశ్రమలు రాలేవని టీడీపీకి తోడు జనసేన కూడా విమర్శించింది. ఇలా తెలంగాణ మంత్రి కేటీఆర్ పర్యటన ఏపీలో కాక రేపడం విశేషం. అయితే గత కొన్ని రోజులుగా కేటీఆర్, గుడివాడ అమర్ నాథ్ పనితీరును బేరీజు వేస్తూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ గా మారాయి. కేటీఆర్ పరిశ్రమల కోసం పరితపిస్తుంటే అమర్ నాథ్ మాత్రం డ్యాన్స్ లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు పోస్టులు చేస్తున్నారు. హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్.. పులివెందుల కేబుల్ బ్రిడ్జ్ వంటివి తేడా చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ వైరల్ గా మారింది. ఈ వ్యవహారం వైఎస్సార్ సీపీకి కొంత ఇరకాటంగా మారింది.