దేశంలో గత కొన్ని రోజులకు ముందు టమాటా ధరలు (Tomato Prices) ఆకాశాన్నంటాయి. అమాంతం పెరిగిన వాటి ధరలను చూసి ప్రజలు గగ్గోలు పెట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దేశంలో ఉల్లి ధరలు (Onion Rates) పెరిగే అవకాశం ఉండటంతో కేంద్రం ముందే అప్రమత్తమైంది. ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన డిసెంబర్ 31వ తేది వరకూ వర్తిస్తుందని వెల్లడించింది. ఉల్లి ధరలకు సెప్టెంబర్లో రెక్కలొస్తాయని సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఉల్లిగడ్డలను మన దేశంలోనే అందుబాటులోకి ఉంచడం కోసం ఈ ట్యాక్స్ విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎగుమతి సుంకం తక్షణమే అమల్లోకి రానుంది. దీంతో అందరికీ మంచి జరిగే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. ఈ మధ్యనే కేంద్రం తన నిల్వల నుంచి 3 లక్షల టన్నుల ఉల్లిగడ్డలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల ఉల్లి ధరలు పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.