»Inter Student Suicide In Madapur Narayana College
Narayana College: మాదాపూర్ నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
నారాయణ కాలేజీలో మరో ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. గతంలో కూడా చాలా మంది చదువుల ఒత్తిడి భరించలేకనో, ర్యాంగింగ్ బారినపడి సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ మాదాపూర్ లోని కాలేజీలో బైపీసీ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
విద్యార్థుల ఆత్మహత్యలు(Suicides) ఆగడం లేదు. చదువుల ఒత్తిడితో ఇప్పటి వరకూ ఎందరో బలవన్మరణాలకు పాల్పడ్డారు. తాజాగా ఓ విద్యార్థి తన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్ నారాయణ కాలేజీలో(Narayana Junior college) చోటుచేసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి శుక్రవారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు.
పోలీసుల కథనం మేరకు..మాదాపూర్ (madhapur)లోని నారాయణ కాలేజీలో కనకరాజు (kanakaraju) అనే విద్యార్థి ఇంటర్ చదువుతున్నాడు. బైపీసీలో సెకండ్ ఇయర్ చదువుతున్న కనకరాజు మధ్యాహ్నం భోజనం తర్వాత క్లాస్‌కు రాలేదు. అటెండెన్స్ తీసుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థి లేకపోవడంతో అతని గదికి వెళ్లి చూశారు. గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని(suicide) విగతజీవిగా కనకరాజు కనిపించడంతో యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది.
కనకరాజు(kanakaraju)ది అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కనకరాజు చదువులో బాగా రాణించేవాడు. ఫస్ట్ ఇయర్లో కూడా అతనికి మంచి మార్కులు వచ్చాయని యాజమాన్యం తెలిపింది. పోలీసులు విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మరోవైపు కనకరాజు ఆత్మహత్యపై తల్లిదండ్రులు షాకింగ్ విషయాలు చెప్పారు. ర్యాగింగ్ వల్లే తమ కొడుకు సూసైడ్ చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో విద్యార్థి గురించి అతని స్నేహితులను పోలీసులు ఆరా తీస్తున్నారు.