హైదరాబాద్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తండ్రీకొడుకులు కలిసి ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన ప్రజల్లో మార్పు రావడం లేదు. దేశంలో ఎక్కడో ఒక చోట మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. లైంగిక వేధింపులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఓ దారుణ ఘటన హైదరాబాద్(Hyderabad)లో జరిగింది. తండ్రీకొడుకులిద్దరూ కలిసి ఓ బాలికను అత్యాచారం చేశారు. కొంపల్లి(kompally)లో ఈ ఘటన వెలుగుచూసింది.
హైదరాబాద్ శివార్లలోని కొంపల్లిలో శివకుమార్(45), కుమారుడు శ్యామల్(19) నివాసముంటున్నారు. వారి పక్కింట్లో ఓ బాలిక ఉంది. ఆ బాలికకు ఫోన్ ఇస్తామని చెప్పి తండ్రీకొడుకులు ఇద్దరూ ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని ఆ బాలికను బెదిరించారు. దీంతో ఆ బాలిక అసలు విషయాన్ని దాచిపెట్టింది.
మూడు రోజుల నుంచి బాలిక ప్రవర్తనలో తేడాను గమనించిన తల్లిదండ్రులు బాలికతో మాట్లాడారు. అప్పటికీ ఆ బాలిక నిజం చెప్పలేదు. తల్లి గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయం బయటపెట్టింది. బాధితురాలి తల్లి షేట్ బషీరాబాద్ పోలీసులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించగా నిందితులైన తండ్రీకొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.