»The Court Sentenced The Famous Film Actress And Former Mp Jayaprada To Six Months Imprisonment
Jayaprada: ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష
సినీ నటి జయప్రదకు ఆరు నెలల జైలు శిక్షను ఎగ్మోర్ కోర్టు విధించింది. కార్మికుల చట్టం ప్రకారం ఆమెకు ఈ శిక్ష పడింది. జైలు శిక్షతో పాటుగా రూ.5 వేల జరిమానానా కోర్టు విధించింది. ఆమెతో పాటు మరో ముగ్గురికి కూడా ఈ శిక్ష పడింది.
ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపి జయప్రద(Jayaprada)కు జైలు శిక్షపడింది. ఎగ్మోర్ కోర్టు ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. చెన్నైలోని రాయపేటలో జయప్రదకు చెందిన థియేటర్ కార్మికుల కేసులో ఆమెకు ఈ శిక్ష ఖరారైంది. జయప్రదతో పాటుగా మరో ముగ్గురికి కూడా ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానాను కోర్టు విధించింది. జయప్రదకు రాయపేటలో ఓ సినిమా థియేటర్ ఉండగా దానిని రామ్ కుమార్, రాజబాబుతో ఆమె నడిపిస్తున్నారు.
ప్రారంభంలో ఈ థియేటర్(theatre) బాగానే నడిచింది. అయితే ఆ తర్వాత థియేటర్ నష్టాల్లోకి వెళ్లడంతో దానిని మూతవేశారు. థియేటర్లో పనిచేసిన కార్మికుల నుంచి ఈఎస్ఐ కోసం వసూలు చేసిన మొత్తాన్ని లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు యాజమాన్యం చెల్లించకపోవడంతో కేసు నమోదైంది. కార్మికులు, కార్పొరేషన్ ఎగ్మోర్ కోర్టును ఆశ్రయించగా కార్మికులకు మొత్తాన్ని సెటిల్ చేస్తామని జయప్రద తరపు లాయర్ కోర్టుకు విన్నవించారు.
కార్మికులకు అమౌంట్ సెటిల్ చేస్తామనే విషయాన్ని కోర్టుకు వివరిస్తూ మూడు పిటిషన్లను దాఖలు చేశారు. అయినప్పటికీ కోర్టు ఆ పిటిషన్లను తోసిపుచ్చింది. లేబర్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లాయర్ అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ కేసును కొనసాగించారు. సుదీర్ఘ విచారణ తర్వాత శుక్రవారం కోర్టు తీర్పు(Court judgement)ను వెల్లడించింది. జయప్రదతో పాటుగా మరో ముగ్గురికి ఆరునెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.5 వేల జరిమానాను విధిస్తూ తీర్పునిచ్చింది.