»Heavy Rain Forecast For Telangana Yellow Alert Issued
Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన..ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
తెలంగాణ(Telangana)లో మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Weather Department) తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. బుధవారం వరకు కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యపేట, మహబూబాద్ జిల్లాల్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ (Yellow Alert)ను జారీ చేసింది.
మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఢిల్లీతోపాటు హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, యూపీ, హర్యానాలో కుండపోత వర్షాలు కురవడం వల్ల చాలా ప్రాంతాల్లో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. వరదల వల్ల ఇప్పటికే 40 మందికి పైగా మృతిచెందారు. భారీ వంతెనలు నేలమట్టమయ్యాయి. కులుమనాలి, కసోల్, పార్వతి వ్యాలీలో యాత్రికులు చిక్కుకుపోవడంతో అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు.