ఒడిశాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంజాం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక MKCG ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాం జిల్లా దిగపహండి సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సును పెళ్లి బృందంతో వెళుతున్న ప్రైవేటు బస్సు ఢీ కొట్టింది. దీంతో బస్సుల్లో ఉన్న ప్రయాణికుల్లో పది మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. డ్రైవర్లు మద్యం మత్తులో ఉన్నారా.. లేక మద్యం మత్తులో ఈ ప్రమాదం జరిగిందా.. లేక అతివేగంగా వాహనాలు నడపడంతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు వివరించారు. మరోవైపు ఈ ఘటనపై అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు.