నగరంలో మెట్రో వచ్చిన తర్వత ప్రయాణం సుఖంగా మారిందని చెప్పొచ్చు. బస్సుల్లో గంటలు తరపడి పట్టిన ప్రయాణం… మెట్రో వచ్చిన తర్వాత సులభంగా గమ్యాన్ని చేరుకున్నారనే చెప్పాలి. ధరలు కూడా మోస్తారుగా ఉండటంతో… నగరవాసులు ఎక్కువగా మెట్రోలోనే ప్రయాణిస్తున్నారు. అయితే… ప్రయాణికులకు మెట్రో షాకివ్వనుంది.
నూతన సంవత్సరంలో మెట్రో ఛార్జీలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఇబ్బందులను గుర్తించేందుకు ఎఫ్ఎఫ్సీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రయాణికులపై భారాన్ని, మెట్రో చార్జీల పెంపుతో వచ్చే సమస్యలను, చార్జీలు పెంచితే రాకపోకలు తగ్గుతాయా లేదా అనే అంశాన్ని అధ్యయనం చేస్తున్నది.
ఈ అధ్యయనం తరువాత ఎఫ్ఎఫ్సీ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా మెట్రో చార్జీల పెంపు ఉంటుందని మెట్రో అధికారులు చెబుతున్నారు. కనిష్ఠంగా రూ. 20, గరిష్టంగా రూ. 80 వరకు చార్జీలు ఉండొచ్చని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. చార్జీల సవరణ పూర్తయితే ప్రస్తుతం రూ.10గా ఉన్న ప్రారంభ టికెట్ ధర రూ.20కి, రూ.60గా ఉన్న గరిష్ఠ ధర రూ.80కి చేరే అవకాశం ఉంది. సిటీ బస్సుల్లో మినిమం చార్జీ రూ. 20 ఉండటంతో అందరూ మెట్రోను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఇప్పుడు మెట్రో చార్జీలు కూడా పెరిగితే ప్రయాణికులు ఏ రవాణా సౌకర్యాలను వినియోగించుకుంటారో చూడాలి.