ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తుున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం ఉత్తరాంధ్ర లో పర్యటిస్తున్నారు. కాగా… ఈ పర్యటనలో భాగంగా..బొబ్బిలిలో మాజీ ఎమ్మెల్సీ శత్రుచర్లపై చంద్రబాబు మండిపడినట్లు తెలుస్తోంది. సీరియస్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం.
మాజీ ఎంపిపి దత్తి లక్ష్మణరావు ను సస్పెండ్ చేశానని చంద్రబాబుకు శత్రుచర్ల చెప్పడంతో అసలు సస్పెండ్ చేయటానికి నువ్వెవరు అని ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. పార్టీలో జాయినింగ్స్ కోసం ప్రయత్నించండి బయటకు పంపించటానికి పనిచేయకండి అని శత్రుచర్లకి బాబు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నీ పెద్దరికం నిలుపుకోవాలని శత్రుచర్ల కు చంద్రబాబు సూచించడంతో చంద్రబాబు యాక్షన్ తో శత్రుచర్ల అవాక్కయ్యారు.
చిన్న చిన్న సమస్యలు ఉంటే పెద్దరికంగా సర్ది చెప్పాలి తప్ప.. సస్పెండ్ చేయకూడదన్న ఆయన ఈ తరహా ఘటనలు మరోసారి తన దృష్టికి తీసుకురావద్దని చెప్పినట్లు తెలుస్తోంది. నిజానికి టిడిపి కురుపాం నియోజకవర్గ ఇన్ఛార్జిగా తోయక జగదీశ్వరిని అధిష్టానం నియమించింది. ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించిన బిడ్డిక పద్మావతి, బిడ్డిక తమ్మయ్య, పువ్వల లావణ్య, విజరుకుమార్, భూపతిదొర తదితరులను కలుపుకొని వెళ్లకుండా ఇన్ఛార్జి కేవలం విజయరామరాజు చెప్పినట్లు వ్యవహరిస్తున్నారనేది కొందరి ఆరోపణ. దీంతో ఆశావాసులంతా ఏకతాటిపైకి వచ్చి గ్రంథాలయ సంస్థ పూర్వ చైర్మన్, టిడిపి సీనియర్ నాయకులు దత్తి లక్ష్మణరావు ఆధ్వర్యంలో మరో గ్రూపుగా ఏర్పడ్డారు. టిడిపి అధిష్టానం ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే రెండు గ్రూపులు పోటాపోటీగా బలనిరూపణకు దిగుతున్న క్రమంలో విజయరామరాజు లక్ష్మణరావును సస్పెండ్ చేశారు. ఈ విషయం మీదనే బాబు సీరియస్ అవుతూ శత్రుచర్ల మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు.