తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని విభేదాలను పరిష్కరించేందుకు వచ్చిన ఆ పార్టీ ముఖ్య నేత దిగ్విజయ్ సింగ్‌కు సీనియర్లపై ఓ క్లార్టీ వచ్చిందా? పార్టీలో ఉండాలనుకునే వాళ్లు ఉంటారు, వెళ్లేవారు వెళ్తారని భావిస్తున్నారా? అంటే ఆయన వ్యాఖ్యలు చూస్తే అలాగే కనిపిస్తోందని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్‌పై ఇప్పటికే పలువురు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. ఆయన రేవంత్‌కు అనుకూలంగా ఉన్నారనే విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో దిగ్విజయ్‌ని రంగంలోకి దింపడంతో ఆయన తమ గోస వింటారని, తమకు ఎప్పటి నుండో పరిచయం ఉండటం, పార్టీకి తమ సేవలను బట్టి ఆయన తమకు అనుకూలంగా ఉంటారని అసంతృప్త సీనియర్లు భావించారు. కానీ శుక్రవారం ఉదయం ఆయన చేసిన వ్యాఖ్యలు రివర్స్‌గా ఉన్నాయి. దీంతో వారి ఆశలు అడియాసలయ్యాయనే చెప్పవచ్చు. అదే సమయంలో అందరితో మాట్లాడాక అసంతృప్త సీనియర్లపై కొందరి మీద డిగ్గీకి ఓ క్లారిటీ రావడంతోనే నిన్న అలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు.
సీనియర్లు, జూనియర్లు అనే మాటలు వద్దని, అందరు కలిసి పని చేస్తేనే అధికారం దక్కించుకుంటామని డిగ్గీ రాజా అన్నారు. అలాగే, ఎవరు కూడా మీడియా ముందుకు రావొద్దని, ఎంత పెద్ద నాయకులైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని స్పష్టంగా చెప్పారు. సీనియర్లు, జూనియర్లు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. బహిరంగ విమర్శలు మాత్రం సహించేది లేదన్నారు. దండం పెడతా, విభేదాలు వద్దని కూడా విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు మొదట సీనియర్లు మాత్రమే మీడియా ముందు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, రేవంత్‌తో కలిసి పని చేయడం కష్టమని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో డిగ్గీ కామెంట్స్ సీనియర్లకు షాక్ అని చెప్పవచ్చు.
రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిపై కూడా డిగ్గీ క్లారిటీ ఇచ్చారు. ఇంచార్జ్, పీసీసీ చీఫ్ మార్పు అంశాలు తన పరిధిలో లేవని చెప్పారు. అదే సమయంలో చిన్న వారికి, కొత్త వారికి పదవులు ఇస్తే తప్పేంటని, అలా గతంలోను ఇచ్చిన సందర్భాలు ఉన్నాయన్నారు. తాను 38 ఏళ్లకు, వైయస్ 34 ఏళ్లకు పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. తద్వారా రేవంత్ పీసీసీ చీఫ్ పదవికి ఢోకా లేదనే విషయాన్ని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చెప్పారు డిగ్గీ. అందరూ పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండాలన్నారు. తద్వారా తెలంగాణలో పీసీసీ చీఫ్‌కు అనుకూలంగా నడుచుకోవాల్సిందేనని చెప్పకనే చెప్పారు. పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉంటారని, అందరు కలిసి పని చేయాలన్నారు.
మొత్తానికి డిగ్గీ వచ్చి తమకు అనుకూలంగా, తమ సమస్యను పరిష్కరిస్తారని భావించిన సీనియర్లకు షాక్ తగిలిందని చెప్పవచ్చు. జగ్గారెడ్డి వంటి నేతలు రేవంత్‌ను తప్పించాల్సిందేననే అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ రేవంత్ పీసీసీ చీఫ్ పదవి నుండి తప్పించేది లేదన్నట్లుగా డిగ్గీ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, సీనియర్ల సూచనతో రేవంత్ పని చేయాలని అంతర్గతంగా చెప్పి ఉంటారని, అదే జరిగితే చాలామంది సీనియర్లు తమ అసంతృప్తిని వీడి కలిసి పని చేయవచ్చునని చెబుతున్నారు. మరో విషయం, ఒకరిద్దరు సీనియర్లు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్న విషయం అర్థమై, వారి మాటలను పక్కన పెట్టి మరీ డిగ్గీ ఒకింత ఘాటుగానే స్పందించి ఉంటారని అంటున్నారు. అయితే దిగ్విజయ్ రాక తర్వాత కాంగ్రెస్ సర్దుకుంటుందా, సీనియర్లు తమ అసంతృప్తిని వీడుతారా చూడాలి.