»Blood Test That Can Detect More Than 50 Types Of Cancer Shows Promise Of Quicker Diagnosis In Uk Study
Blood Test: ఒక్క బ్లడ్ టెస్ట్తోనే క్యాన్సర్ని గుర్తించొచ్చు.. ఎలాగో తెలుసా?
ఈరోజుల్లో చాలా మంది క్యాన్సర్ బారిన పడి ఇబ్బంిది పడుతున్నారు. క్యాన్సర్ చివరి స్టేజ్ లోకి వచ్చేవరకు చాలా మందికి తమకు క్యాన్సర్ సోకిన విషయం తెలియడం లేదు. దీని వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారు ఉన్నారు. అయితే, తాజాగా నిపుణులు దీనికి ఓ పరిష్కారం తీసుకువచ్చారు. కేవలం ఒక్క బ్లడ్ టెస్టుతో 50 రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చని వారు చెబుతున్నారు.
క్యాన్సర్(Cancer) సోకినవారికి కొన్ని రకాల లక్షణాల ద్వారా వారికి జబ్బు సోకిందని గుర్తిస్తాం. అయితే, ఎలాంటి లక్షణాలు కనపడకముందే, ఈ రక్త పరీక్ష ద్వారా క్యాన్సర్ ని గుర్తించవచ్చట. తద్వారా వాటికి చికిత్స చేయటం, నయం చేయటం సులభమవుతుందని నిపుణులు ఆశిస్తున్నారు. ఈ పరీక్షలో క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించిన ఫలితాల్లో 99 శాతం పైగా కచ్చితత్వం ఉందని ఈ రక్త పరీక్షను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల బృందం తెలిపింది. డాక్టర్లు ఈ పరీక్షలను రోగుల మీద ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నారని.. వీటిపై మరింత అధ్యయనం అవసరమని ఆనల్స్ ఆఫ్ ఆంకాలజీ వెల్లడించింది. ప్రయోగాల ఫలితాలను బట్టి.. వ్యాధి ప్రారంభ దశల్లో కన్నా గానీ వ్యాధి ముదిరినప్పుడు మరింత మెరుగ్గా గుర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనివల్ల ఈ పరీక్షల ఉపయోగానికి పరిమితులు ఉండవచ్చు.
పరిశోధనలో, 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న దాదాపు 6,238 మంది రోగులపై ఈ పరీక్షలు చేశారు. వారు స్త్రీ జననేంద్రియ, ఊపిరితిత్తులు, దిగువ GI లేదా ఎగువ GI క్యాన్సర్(Cancer)కు సంబంధించిన అనుమానాస్పద లక్షణాలను పరిశోధించడానికి అత్యవసర ఇమేజింగ్, ఎండోస్కోపీ లేదా ఇతర రోగనిర్ధారణ పద్ధతుల కోసం సూచించారు. ఈ రక్త పరీక్షను తయారు చేసిన గ్రెయిల్ అనే సంస్థ ఈ అధ్యయనానికి నిధులు సమకూర్చింది.‘‘మొత్తం జనాభాకు ఏవైనా క్యాన్సర్లు ఉన్నాయేమో ప్రాథమిక తనిఖీ కోసం ఉపయోగపడే లక్షణాలు ఈ రక్త పరీక్షకు ఉన్నట్లు కనిపిస్తోంది’’ అని ఈ పరిశోధన బృంద సారథుల్లో ఒకరైన ప్రొఫెసర్ జెఫ్ ఆక్స్నార్డ్ పేర్కొన్నారు.
‘‘ఇటువంటి పరీక్ష ఎప్పుడు ఉపయోగంలోకి వస్తుందని అందరూ అడుగుతున్నారు. వేలాది మంది రోగుల మీద వైద్య పరంగా విజయవంతమైన ఫలితాలు ఇవ్వటంతో ఈ పరీక్షను పరిమితంగా వైద్య ప్రయోగాలకు అందించాం’’ అని ఆయన తెలిపారు. ఈ రక్త పరీక్షను సాధారణ వాడుకలోకి తెచ్చే ముందు.. వాటి ఫలితాలను మరింత లోతుగా అర్థం చేసుకోవటానికి తాజా వైద్య ప్రయోగాల ఫలితాలను చూడాల్సి ఉంటుందన్నారు.