నల్గొండ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధినేత (AICC) మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోమటిరెడ్డి గత కొంతకాలంగా రాష్ట్ర పార్టీ తీరు పైన తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. ఖర్గే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం కోమటిరెడ్డి తొలిసారి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర పార్టీ తీరు, కార్యకలాపాలపై, నేతల అసంతృప్తిపై ఖర్గే ఆరా తీసినట్లుగా సమాచారం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా అయ్యాక చాలామంది సీనియర్లు వరుసగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
అప్పటికే అసంతృప్తితో ఉన్న సీనియర్లకు మరింత ఆగ్రహం తెప్పించేలా వారిని కలుపుకొని పోయే ప్రయత్నం చేయకుండా, తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకుంటూ, సీనియర్లను పూర్తిగా విస్మరిస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకట రెడ్డి వంటి నేతలు బాహాటంగానే తమ తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. మరికొందరు సీనియర్ నేతలు లోలోపల మదనపడుతున్నారని అంటున్నారు. కోమటిరెడ్డి కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆయన పార్టీకి దూరమవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి తోడు ఇటీవల రాష్ట్ర కమిటీల్లో ఆయనకు చోటు దక్కలేదు. దీంతో ఆయనను కాంగ్రెస్ కూడా పక్కన పెట్టిందనే వాదనలు వినిపించాయి. అయితే తనకు పార్టీ కమిటీల్లో చోటు దక్కకపోవడంపై కోమటిరెడ్డి స్పందిస్తూ, తనకు హైలెవల్ కమిటీలో చోటు ఉంటుందని భావిస్తున్నానని, అయినా ఎన్నికలకు నెల రోజుల ముందు రాజకీయాలు మాట్లాడుతాని చెప్పారు.
కోమటిరెడ్డి పార్టీకి దూరమవుతున్నారని, అలాగే కమిటీలలో చోటు కల్పించకుండా పక్కన పెట్టడం ద్వారా ఆయన కాంగ్రెస్ పక్కన పెట్టిందనే వాదనల నేపథ్యంలో కోమటిరెడ్డి పార్టీ అధ్యక్షుడిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన పట్ల కొందరు నేతలు వ్యవహరించిన తీరుతో తాను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కోమటిరెడ్డి వివరించినట్లుగా తెలుస్తోంది. తాను ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటం వంటి అంశాలు ఎందుకు చోటు చేసుకున్నాయో వివరించినట్లుగా తెలుస్తోంది.