Revanth Reddy: ఔటర్ రింగ్ రోడ్ టెండర్ల విషయంలో జరిగిన గోల్ మాల్ గురించి మరోసారి మీడియా ముందుకు వచ్చారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy). ఓఆర్ఆర్ స్కామ్.. లిక్కర్ స్కామ్ కన్నా పెద్దదని చెప్పారు. ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో లక్ష కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. కేవలం రూ.7300 కోట్లకు విక్రయించారని మండిపడ్డారు. ఓఆర్ఆర్ స్కామ్ గురించి బీజేపీ నేతలు ఎందుకు నోరు తెరవడం లేదని రేవంత్ (Revanth) ప్రశ్నించారు.
ఓఆర్ఆర్ను పుణేకు చెందిన ఐఆర్బీ డెవలపర్స్‌కు అమ్మేశారని రేవంత్ (Revanth) ఆరోపించారు. ఈ కేటాయింపులో సీఎం కేసీఆర్ (KCR), మంత్రి కేటీఆర్ (KTR), అర్వింద్ కుమార్, సోమేశ్ కుమార్ ఉన్నారని అంటున్నారు. తాను చెప్పిన అంశాలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) చెబుతున్నారని రేవంత్ (Revanth) గుర్తుచేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) మాత్రం నోరు మెదపడం లేదన్నారు. ఓ సారి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి.. రూ.2 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని అన్నారు. మరీ ఆయన ఎందుకు కేంద్రానికి లేఖ రాయలేదని నిలదీశారు.
ఓఆర్ఆర్ టెండర్ల విషయంలో అన్నీ తప్పిదాలే ఉన్నాయని రేవంత్ (Revanth) అన్నారు. కనీస ధర ప్రకటించకుండా టెండర్లు పిలువడం నిబంధనలకు విరుద్దం అని గుర్తుచేశారు. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ అనుసరించి టెండర్ పిలువాలంటే 2031లోపు ఉండాలని.. ఓఆర్ఆర్ విషయంలో 30 ఏళ్లకు కట్టబెట్టారని మండిపడ్డారు. మిగతా చోట్ల 15 ఏళ్లు, 20 ఏళ్లకు టెండర్లు పిలుస్తుంటారు.
ఓఆర్ఆర్కు సంబంధించిన ఒప్పంద పత్రం తన వద్ద ఉందని రేవంత్ (Revanth) గుర్తుచేశారు. ఈ ఏప్రిల్ 27వ తేదీన ఒప్పందం జరిగిందని తెలిపారు. టెండర్లు ఆమోదించి నెలరోజులు అవుతుందని వివరించారు. రూ.7300 కోట్లలో రూ.25 శాతం రూ.1800 కోట్లు ప్రభుత్వానికి ఐఆర్బీ డెవలపర్స్ చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఇప్పటివరకు ప్రభుత్వానికి రూపాయి రాలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం నిబంధనలను మార్చితే ఆ విషయం ఎందుకు చెప్పడం లేదన్నారు.