ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ ట్రైలర్ రానే వచ్చింది. ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేసిన ట్రైలర్ వీడియో మేకర్స్ రిలీజ్ చేశారు.
2023లో ప్రపంచం అంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆదిపురుష్(Adipurush). భారీ అంచనాల నడుమ ఈరోజు ఆదిపురుష్ మూవీ ట్రైలర్(trailer) విడుదలైంది. ఈ మెగా ట్రైలర్ వీడియో జై శ్రీరామ్ అంటూ ఆసక్తికరంగా కొనసాగుతుంది.
ఇది నా రాముడి కథ. ఆయన మనిషిగా పుట్టిన భగవంతుడైన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందుడి గాథ. యుగయుగాల్లోనూ సజీవం.. జాగ్రుతం. నా రాఘవుడి కథే రామాయణం.. ’’ అంటూ హనుమంతుడు చెబుతుండగా ట్రైలర్ ప్రారంభం అవుతుంది.
ఆ వెంటనే భిక్షాందేహీ అంటూ రావణుడు ఎంట్రీ.. సీతను ఎత్తుకుపోవడం కనిపిస్తుంది. సీత తీసుకు రావడానికి లక్ష్మణుడు అయోధ్య సైన్యాన్ని తీసుకువద్దాం అని చెబుతాడు. అది మర్యాద కాదంటూ రాముడు వద్దంటాడు. సీత తనకు ప్రాణమే అయినా.. ప్రాణం కంటే మర్యాదే ముఖ్యం అని చెప్పడం రాముడి పాత్ర ఔచిత్యాన్ని సూచిస్తుంది. ట్రైలర్ ను బట్టి చూస్తే ఆదిపురుష్ రామాయణ కావ్యం మొత్తం కాకుండా కేవలం సీతాపహరణం ఎపిసోడ్ ను మాత్రమే చూపించేలా కనిపిస్తోంది. చివర్లో వచ్చిన రామ రావణ యుద్ధానికి నేటి ఆధునిక టెక్నాలజీని జోడించినట్టు కనిపిస్తోంది. ఇది సినిమాకు ప్రధాన బలంగా ఉండే అవకాశం ఉంది. విజువల్స్ పరంగా సింప్లీ సూపర్బ్. మొదట్లో వచ్చిన విమర్శలకు దీటైన జవాబులా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కనిపిస్తున్నాయి. రాముడు ప్రభాస్, సీతగా కృతి సనన్ జోడీ బావుంది.
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ సినిమా ట్రైలర్ ను మధ్యాహ్నం 2.06 గంటలకు, T-సిరీస్ అధికారిక YouTube ఖాతాలో ట్రైలర్ విడుదలైంది. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలోని పీవీఆర్ జుహులో జరిగే ఆన్‌గ్రౌండ్ లాంచ్ వేడుకకు ప్రభాస్, కృతి, దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్, రచయిత మనోజ్ ముంతాషిర్ హాజరుకానున్నారు. ఆదిపురుష్ బృందం సోమవారం హైదరాబాద్‌లోని కొద్దిమంది కోసం ఈ చిత్రం ట్రైలర్‌ను ప్రదర్శించింది.
మరోవైపు నేటి ముంబై ప్రీమియర్‌కు ముందే “ఆదిపురుష్ ట్రైలర్” అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్లో అగ్రస్థానంలో ఉంది.
ఆదిపురుష్ మూవీ హిందూ ఇతిహాసం రామాయణంపై ఆధారపడిన స్టోరీ. “చెడుపై మంచి సాధించిన విజయాన్ని” జరుపుకునే చిత్రంగా రూపొందించారు. ఆదిపురుష్‌లో రాఘవగా ప్రభాస్, జానకిగా కృతి సనన్, శేష్‌గా సన్నీ సింగ్, బజరంగ్గా దేవదత్తా నాగే నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ కూడా లంకేష్ విలన్‌గా నటిస్తున్నారు.
ఈ చిత్రం ఆగష్టు 11, 2022న థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే విడుదల తేదీని తర్వాత జనవరి 12, 2023కి వెనక్కి మార్చారు. చివరిగా ఆదిపురుష్ ఇప్పుడు 3Dలో జూన్ 16, 2023న విడుదల కానుంది.