ఆసియా కప్ లో భాగంగా భారత్ తో తలపడిన పాకిస్తాన్ కి ఎదురు దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ లో పాక్ ఓటమిపాలైంది. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత్ జట్టు 5 వికెట్ల తేడాతో పాక్‌పై గెలుపొందింది. కాగా… పాక్ ఓటమిపై ఆ దేశ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ స్పందించారు. పాక్ కెప్టెన్ బాబర్ చేసి తప్పు కారణంగానే జట్టు ఓటమి పాలైందని వసీం అభిప్రాయపడ్డాడు.
చివరి వరకూ ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ బౌలర్లని రొటేట్ చేయడంలో తేలిపోయాడని వసీం అక్రమ్ చెప్పుకొచ్చాడు.భారత్ విజయానికి ఆఖరి 6 బంతుల్లో 7 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో కేవలం ఐదుగురు బౌలర్లతోనే మ్యాచ్ ఆడిన పాకిస్థాన్‌కి స్పిన్నర్ మహ్మద్ నవాజ్ తప్ప మరో ఆప్షన్ లేకపోయింది. అప్పటికే ఫాస్ట్ బౌలర్ల నాలుగు ఓవర్ల కోటా ముగిసిపోయింది. దాంతో.. నవాజ్తోనే బౌలింగ్ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా కాకుండా నవాజ్‌తో 13 లేదా 14 ఓవర్‌ని వేయించి ఉండాల్సిందని అక్రమ్ చెప్పుకొచ్చాడు. లాస్ట్ ఓవర్లో నాలుగో బంతికి సిక్స్ బాదిన హార్దిక్ పాండ్య భారత్‌ని గెలిపించాడు.
‘మ్యాచ్ జరిగిన దుబాయ్ పిచ్ నాకు బాగా నచ్చింది. రెండు జట్ల బౌలర్లు బౌన్సర్లు విసిరి వికెట్లు తీయడాన్ని నేను బాగా ఎంజాయ్ చేశా. లాస్ట్ ఓవర్ వరకూ గేమ్‌ని తీసుకెళ్లగలిగారు. కానీ.. మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఒక తప్పిదం చేశాడు. స్పిన్నర్ నవాజ్‌తో 13 లేదా 14వ ఓవర్‌ని వేయించి ఉండాల్సింది. కానీ.. చాలా ఆలస్యమైపోయింది. టీ20ల్లో చివరి 3-4 ఓవర్లని స్పిన్నర్‌తో అస్సలు వేయించకూడదు’’ అని వసీం అక్రమ్ హితవు పలికాడు.