తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఐటీ సోదాల అనంతరం.. గత రాత్రి మల్లారెడ్డి ఇంట్లో హైడ్రామా నడిచింది. ఐటీ అధికారులు తన కుమారులతో అక్రమంగా సంతకాలు చేయించుకున్నారంటూ మంత్రి ఫిర్యాదు చేశారు. ఐటీ అధికారితో కలిసి బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు.
అటు ఐటీ అధికారులు కూడా మల్లారెడ్డిపై రివర్స్ కంప్లైంట్ ఇచ్చారు. తమ విధులకు ఆటంకం కలిగించారని, తమతో దురుసుగా ప్రవర్తించారంటూ ఫిర్యాదు చేశారు. మరోవైపు ఐటీ సోదాల్లో దొరికిన నగదు, డాక్యుమెంట్లకు సంబంధించి ఆయన్ను విచారణకు రావాలని ఐటీ శాఖ సమన్లు జారీ చేసింది. దీంతో సోమవారం నాడు ఆయన విచారణకు హాజరుకానున్నారు.
మరోవైపు మల్లారెడ్డి పీఏ సంతోష్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేశారు. రెండు రోజుల పాటు తనిఖీలు చేసిన ఐటీ బృందాలు.. సంతోష్ రెడ్డి ఇంటి నుంచి నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. సంతోష్ రెడ్డి స్టేట్ మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. అటు బాలానగర్ లోని క్రాంతి బ్యాంక్ లో వరుసగా రెండో రోజూ ఐటీ తనిఖీలు కంటిన్యూ అయ్యాయి. మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తెను బ్యాంకుకి తీసుకెళ్లారు అధికారులు. బ్యాంకు లాకర్ తెరిచేందుకు ప్రయత్నించినా.. లాకర్ తాళాలు తీసుకుని రాకపోవడంతో బ్యాంకు నుంచి వెనుదిరిగారు.
హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన దాదాపు 400 మంది అధికారులు 65 బృందాలుగా విడిపోయి ఈ సోదాల్లో పాల్గొన్నారు. కొన్ని చోట్ల సోదాలు ముగిశాయి. మరికొన్ని చోట్ల ఈ రాత్రికి ముగియనుండగా, ఇంకొన్ని చోట్ల గురువారం కూడా తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.